ఇంట‌ర్ విద్యార్థుల గొడ‌వ‌, ఒక‌రు మృతి, మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం

న‌ల్ల‌గొండ జిల్లాలో ఇంట‌ర్ విద్యార్థుల మ‌ధ్య గొడ‌వ‌ జ‌రిగింది. ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ధోరేప‌ల్లిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్రవీణ్ అనే విద్యార్థి క‌త్తితో దాడి చేయ‌డంతో ల‌క్ష్మ‌ణ్ అనే విద్యార్థి చ‌నిపోయాడు. లక్ష్మ‌ణ్ అన్న చందుకు తీవ్ర గాయాల‌య్యాయి.

చందు ప‌రిస్థితి విష‌యంగా ఉంది. మ‌రో ఇద్ద‌రు విద్యార్థులు కూడా గాయ‌ప‌డ్డారు. వారు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వారం క్రితం ల‌క్ష్మ‌ణ్, ప్ర‌వీణ్‌ గొడ‌వ‌ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ల‌క్ష్మ‌ణ్‌ను ప్ర‌వీణ్ కొట్టాడు. ఈ నేప‌థ్యంలో రాత్రి బ‌స్ స్టాండ్ వ‌ద్ద ప్ర‌వీణ్ క‌నిపించ‌డంతో ల‌క్ష్మణ్ అన్న చందు… ప్ర‌వీణ్‌ను నిల‌దీశాడు. త‌న
త‌మ్ముడిని ఎందుకు కొట్టావంటూ ప్ర‌శ్నించాడు.

కోపంతో ప్ర‌వీణ్ చెంప‌పై చందు ఒక దెబ్బ‌కొట్టాడు. దీంతో ప్ర‌వీణ్ వెంటనే కత్తి తీసి ల‌క్ష్మణ్ చాతీపై పొడిచేశాడు. దాంతో అత‌డు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. చందు పొట్ట‌లోకి క‌త్తి దిగ‌డంతో పేగులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ గొడ‌వ‌ను చూసి మ‌రో ఇద్ద‌రు యువ‌కులు అక్క‌డికి వ‌చ్చి అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. వారిపైనా క‌త్తితో ప్ర‌వీణ్ దాడి చేయ‌డంతో వారికీ గాయాల‌య్యాయి. దాడి అనంత‌రం ప్ర‌వీణ్ పారిపోయాడు. అత‌డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.