కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తా- రేణుకాచౌద‌రి

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రేణుకాచౌద‌రి ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఆమె… ఇప్పుడు పార్టీ తీరు మార‌కుంటే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు చెప్పారు.

గురువారం జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆమె ఈ ప్ర‌క‌ట‌న చేశారు. కాంగ్రెస్ పార్టీ త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు. ఖ‌మ్మం జిల్లా డీసీసీ అధ్య‌క్షుడి ఎంపిక‌లోనూ త‌న‌ను సంప్ర‌దించ‌లేద‌ని ఆమె మండిప‌డ్డారు. ఖ‌మ్మం పార్లమెంట్ టికెట్‌కు ఇత‌రుల పేర్లు వినిపిస్తున్న నేప‌థ్యం రేణుకా తీవ్రంగా స్పందించారు.

ఖ‌మ్మం పార్ల‌మెంట్ టికెట్ త‌న‌కు ఇవ్వ‌ని ప‌క్షంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. చివ‌ర‌కు టికెట్ కూడా ఇవ్వ‌కుంటే పార్టీలో ఉండి లాభ‌మేంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. 2014 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం పార్ల‌మెంట్ స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐ నారాయ‌ణ‌కు వ‌దిలేసింది. ఈసారి విజ‌య‌శాంతికి ఖ‌మ్మం సీటు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 1999, 2004లో రేణుకాచౌద‌రి ఖ‌మ్మం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ త‌ర్వాత ఓడిపోయారు. ఓడిపోయిన రేణుకాచౌద‌రిని కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ ఎంపీగా పంపింది.