జ్యోతి హ‌త్య కేసులో ఊహించ‌ని ట్విస్ట్‌… హంత‌కుడు అత‌డే..

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి జ్యోతి హ‌త్య కేసులో చిక్కు ముడి వీడింది. జ్యోతి హ‌త్య వెనుక ప‌రువు అంశం గానీ, దుండ‌గుల ప్ర‌మేయం గానీ లేద‌ని పోలీసులు తేల్చారు. జ్యోతిని ప్రియుడు శ్రీనివాస‌రావే హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. స్వ‌యంగా అర్బ‌న్ ఎస్పీనే రంగంలోకి దిగి ఆస్ప‌త్రిలో ఉన్న శ్రీనివాస‌రావును సుధీర్ఘంగా ప్ర‌శ్నించారు. త‌మ‌కు ల‌భించిన ఆధారాల సాయంతో గ‌ట్టిగా విచారించే స‌రికి అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

జ్యోతిని హ‌త్య చేసే స‌మ‌యంలో శ్రీనివాస‌రావుకు అత‌డి ఇద్ద‌రు స్నేహితులు స‌హ‌క‌రించిన‌ట్టు పోలీసులు తేల్చారు. జ్యోతిని హ‌త్య చేసిన త‌ర్వాత అనుమానం రాకుండా ఉండేందుకు శ్రీనివాస‌రావు త‌న స్నేహితుల‌తో త‌న‌పైనా డ‌మ్మీ దాడి చేయించుకున్నాడు. అయితే స్నేహితులు కాస్త గ‌ట్టిగా కొట్ట‌డంతో శ్రీనివాస‌రావు బ‌ల‌మైన గాయ‌మైనట్టు పోలీసులు తేల్చారు.

శ్రీనివాస‌రావుపై అనుమానం వ‌చ్చిన పోలీసులు అత‌డి గ‌తాన్ని కూడా ప‌రిశీలించ‌గా అత‌డిపై ఇప్ప‌టికే మూడు కేసులున్న‌ట్టు తేలింది. ఇత‌డు అమ్మాయిల‌ను నమ్మించి తీసుకెళ్లి నిర్మానుష్య‌ప్రాంతంలో వారిపై లైంగిక దాడి చేసి ఆ స‌మ‌యంలో ఆ దృశ్యాల‌ను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేసే వాడ‌ని పోలీసులు గుర్తించారు.

జ్యోతి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. త‌న‌ను పెళ్లి చేసుకుని తీరాల్సిందేన‌ని జ్యోతి ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఆమెను అడ్డుతొల‌గించుకునేందుకు హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. జ్యోతిని న‌మ్మించి అమ‌రావ‌తి స్డేడియం వ‌ద్ద‌కు తీసుకెళ్లిన శ్రీనివాస‌రావు ఆమెతో స‌న్నిహితంగా ఉంటున్న‌ప్ప‌టి దృశ్యాల‌ను రికార్డు చేసేందుకు ప్ర‌య‌త్నించాడు.

ఆ దృశ్యాల సాయంతో ఆమెను బ్లాక్‌మెయిల్ చేయాల‌నుకున్నాడు. కానీ ఆ స‌మ‌యంలో ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో స్నేహితుల‌తో క‌లిసి ఆమెను చంపేశాడు. ఇనుప రాడ్ సాయంతో ఆమె త‌ల‌పై బ‌లంగా మూడునాలుగు సార్లు మోద‌డంతో ఆమె త‌ల చిద్ర‌మైపోయింది.