గ్రేట‌ర్‌లో క్లాక్‌ట‌వ‌ర్ల‌ కోసం క‌దలిక‌

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని చారిత్ర‌క క్లాక్‌ట‌వ‌ర్ల‌ను సంర‌క్షించేందుకు జీహెచ్ఎంసీ సిద్ద‌మైంది. వందేళ్ల‌కు పైబ‌డి ఉన్న క్లాక్ ట‌వ‌ర్ల‌ను పున‌రుద్ద‌రించి పాత జ్ఞాప‌కాల‌ను రాబోయే త‌రాల‌కు అందించాల‌ని నిర్ణ‌యించారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో వందేళ్ల‌కు పైబ‌డిన 12 క్లాక్ ట‌వ‌ర్లు ఉన్నాయి. అందులో 9 హైద‌రాబాద్ ప‌రిధిలో ఉండ‌గా… మూడు సికింద్రాబాద్ ప‌రిధిలో ఉన్నాయి. ఇవి  శిథిలావ‌స్థ‌కు చేరాయి. గ‌డియారాలు కూడా ప‌నిచేయ‌డం లేదు.

ప్ర‌స్తుతం అంద‌రికి మొబైల్స్, వాచ్‌లు అందుబాటులో ఉండ‌డంతో ఈజీగా స‌మ‌యం తెలుసుకోగ‌లుగుతున్నారు. కానీ గ‌తంలో ఈక్లాక్ ట‌వ‌ర్లే ప్ర‌జ‌ల‌కు టైంను తెలియ‌జేసేవి. వాటి అవ‌స‌రం త‌గ్గిపోవ‌డంతో వాటి నిర్వాహ‌ణ కూడా స‌రిగా లేదు. అయితే పురాత‌న క్లాక్ ట‌వ‌ర్ల‌ను అలా వ‌దిలేయ‌డం స‌రికాద‌ని భావించిన ప్ర‌భుత్వం వాటిని పున‌రుద్దరిస్తోంది. జీహెచ్ఎంసీ బృందం ఈ పురాత‌న క్లాక్ ట‌వ‌ర్ల‌ను గ‌త కొద్దిరోజులుగా ప‌రిశీలిస్తోంది.

క్లాక్ ట‌వ‌ర్ల‌ను పటిష్టం చేయ‌డంతో పాటు గ‌డియారాలు తిరిగి ప‌నిచేసేలా చేయ‌నున్నారు. శాలిబండ, సుల్తాన్‌బ‌జార్‌, మోండా మార్కెట్‌ల‌లోని పురాత‌న క్లాక్‌ట‌వ‌ర్ల‌ను వెంట‌నే మ‌ర‌మ్మ‌తులు చేయ‌నున్నారు. ఇప్ప‌టికే మ‌హ‌బూబ్ చౌక్‌, మోజంజాహీ మార్కెట్‌, సికింద్రాబాద్ క్లాక్‌ట‌వ‌ర్ల‌ను పున‌రుద్ద‌రించి న‌గ‌ర‌వాసులు స‌మ‌యాన్ని తెలుసుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. సుల్తాన్ బ‌జార్ క్లాక్‌ట‌వ‌ర్ గ‌త కొన్నేళ్లుగా నిర్వ‌హ‌ణ లోపం వ‌ల్ల పూర్తిగా శిథిలావ‌స్థ‌లోకి చేరుకోవ‌డంతో పాటు క్లాక్‌ట‌వ‌ర్ ప్ర‌ధాన ర‌హ‌దారి వైపు ముందుభాగం ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన‌ట్టు గుర్తించారు. ఈ క్లాక్‌ట‌వ‌ర్‌ను పున‌రుద్ద‌రించ‌డంతో పాటు మ‌ర‌మ్మ‌తులు జ‌రిపి చుట్టూ ప్ర‌హ‌రీగోడ నిర్మించేందుకు నిర్ణ‌యించారు.