పార్క్‌లో పెళ్లి చేశార‌ని… అదృశ్య‌మైన ప్రేమ జంట‌

మోర‌ల్ పోలీసింగ్ పేరుతో కొంద‌రు వ్యక్తులు ప్రేమికుల రోజు చేసిన ప‌ని క‌ల‌క‌లం రేపుతోంది. హైద‌రాబాద్ మేడ్చ‌ల్‌లో ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా కొంద‌రు వ్య‌క్తులు ఆక్సిజ‌న్‌ పార్కులో ఉన్న ప్రేమ జంట‌కు బ‌లవంతంగా పెళ్లి చేశారు.

అబ్బాయి అమ్మాయికి తాళి క‌డుతున్న దృశ్యాల‌ను సెల్‌ఫోన్‌ల‌లో రికార్డు చేసి అనంత‌రం సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో వైర‌ల్ అయింది. వీడియోను చూసిన అమ్మాయి త‌ల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ప్రేమ జంట తిరిగి ఇంటికి రాక‌పోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

19 ఏళ్ల అమ్మాయిని ఆమె తండ్రి ఉద‌యం కాలేజ్ వ‌ద్ద వ‌దిలి వెళ్లాడు. అయితే ఆమె క్లాస్‌కు వెళ్ల‌కుండా అబ్బాయితో క‌లిసి పార్క్‌కు వెళ్లింది. స‌ద‌రు అబ్బాయి అమ్మాయికి ద‌గ్గ‌రి బంధువేన‌ని చెబుతున్నారు. ఈ జంట‌ను పార్కులో చూసిన‌ ఆరుగురు వ్య‌క్తులు వారికి బ‌ల‌వంతంగా పెళ్లి చేసి రికార్డు చేశారు. ఇలా పెళ్లి చేసిన వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్‌కు నాయ‌క‌త్వం వ‌హించిన వ్య‌క్తిని శ్రీహ‌రి చారిగా గుర్తించారు. ఇత‌డు బీఎస్పీలో ప‌నిచేస్తున్నాడు.

కేవ‌లం అంద‌రి దృష్టిని ఆక‌ర్శించేందుకే తాము పెళ్లి చేశామ‌ని… అంత‌కు మించి త‌మ‌కేమీ తెలియ‌ద‌ని శ్రీహ‌రి చెబుతున్నాడు. క‌నిపించ‌కుండా పోయిన అబ్బాయి, అమ్మాయి కోసం గాలిస్తున్నారు. అవ‌మాన భారం, ఇంట్లో తెలిస్తే ఏం జ‌రుగుతుందోన‌న్న భ‌యంతోనే వారు ఇంటికి వ‌చ్చేందుకు వెనుకాడి ఉంటార‌ని భావిస్తున్నారు.