మా ర‌క్తం మ‌రుగుతోంది… భారీ మూల్యం చెల్లించుకుంటారు

భార‌త సైనికుల‌పై దాడి చేసిన ఉగ్ర‌వాదులు భారీ మూల్యం చెల్లించుకోక‌ త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ. అమ‌రులైన సైనికుల కుటుంబాల‌కు దేశం  అండ‌గా ఉంటుంద‌న్నారు. పుల్వామా దాడికి ఉగ్ర‌వాదులు త్వ‌ర‌లోనే భారీ మూల్యం చెల్లించుకుంటార‌ని మోడీ హెచ్చ‌రించారు. ఉగ్ర‌దాడితో భార‌తీయుల నెత్తురు మ‌రుగుతోంద‌న్నారు.

దాడుల‌కు భార‌త్ ఎన్న‌డూ భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. భార‌త సైనికుల ధైర్య‌సాహ‌సాల‌పై త‌మ‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌న్నారు. వీర జ‌వాన్ల త్యాగాల‌ను వృథా కానివ్వ‌బోమ‌న్నారు. భార‌త్‌లో అల‌జ‌డి, అస్థిర‌త్వం సృష్టించేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాలు ఎప్ప‌టికీ స‌ఫ‌లం కాబోవ‌న్నారు. ఈ దాడి వెనుక ఉన్న శ‌క్తులు అందుకు శిక్ష అనుభ‌విస్తాయ‌న్నారు. భ‌ద్ర‌తాబ‌ల‌గాల‌కు పూర్తి స్వేచ్చ‌నిచ్చామ‌ని మోడీ చెప్పారు.

అధికారంలో ఉన్నా… విప‌క్షంలోఉన్నా ఇలాంటి దాడులను ప్ర‌తి ఒక్క‌రూ ఖండించాల్సిందేన‌న్నారు. ఉగ్ర‌దాడికి 130 కోట్ల భార‌తీయుల జ‌వాబును ఉగ్ర‌వాదులు రుచి చూస్తార‌ని హెచ్చ‌రించారు. అమ‌రులైన జ‌వాన్ల‌కు మోడీ నివాళుల‌ర్పించారు. ఉగ్ర‌దాడిని ఖండించిన దేశాల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ప్ర‌ధాని.