ఉగ్ర‌దాడిపై సిద్ధు వ్యాఖ్య‌ల దుమారం

పుల్వామాలో జ‌నాన్ల‌పై ఉగ్ర‌దాడి ప‌ట్ల దేశం మొత్తం ర‌గిలిపోతుంటే కాంగ్రెస్ నేత‌, మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం మ‌రోలా స్పందించారు. ఇప్ప‌టికే పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగ‌నం చేసుకుని భార‌తీయుల చేత చివాట్లు తిన్న సిద్ధు… ఉగ్ర‌దాడిపై తిరిగి భార‌త్‌కే నీతిబోధ‌ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

ఉగ్ర‌దాడి వెనుక పాకిస్థాన్ హ‌స్త‌ముంద‌ని ప్ర‌తి ఒక్క‌రూ మండిప‌డుతూ, పాక్‌తో తాడోపేడో తేల్చుకోవాల‌ని డిమాండ్ చేస్తుంటే సిద్ధూ మాత్రం ఉగ్ర‌వాదానికి మ‌తం, జాతి ఉండ‌ద‌ని వ్యాఖ్యానించారు. అంత‌టితో ఆగ‌కుండా పాకిస్థాన్‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని సూచించారు. పాకిస్థాన్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్పుడు మాత్ర‌మే ఇలాంటి దాడులు జ‌ర‌గ‌కుండా ఉంటాయ‌ని వ్యాఖ్యానించాడు.

సిద్ధూ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్‌పై విరుచుకుప‌డుతున్నారు. వ‌రుస‌గా దొంగ దెబ్బ‌తీస్తున్న పాకిస్థాన్‌ను వెనుకేసుకొచ్చేలా సిద్ధూ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని మండిప‌డుతున్నారు. పాక్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్పుడు మాత్ర‌మే ఇలాంటి దాడులు జ‌ర‌గ‌కుండా ఉంటాయ‌ని చెప్ప‌డం ద్వారా భార‌త్‌ను చేత‌గాని దేశంగా ప్ర‌పంచానికి సిద్ధు చాటాల‌నుకుంటున్నారా అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.