అశోక్ గ‌జ‌ప‌తిరాజు కూడా….

టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ్య‌వ‌హారం ఇప్పుడు టీడీపీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆయ‌న టీడీపీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. చివ‌ర‌కు చంద్ర‌బాబు నిర్వ‌హించిన పొలిటి బ్యూరో స‌మావేశానికి కూడా హాజ‌రుకాలేదు. తాను పోలిట్ బ్యూరోకు హాజ‌రుకాబోన‌ని నేరుగానే అశోక్ గ‌జ‌ప‌తిరాజు పార్టీ పెద్ద‌ల‌కు తేల్చేశారు. ఆయ‌న లేకుండానే శ‌నివారం పొలిట్ బ్యూరో స‌మావేశం ప్రారంభ‌మైంది.

అశోక్ గ‌జ‌ప‌తిరాజు అలిగిన‌ట్టు చెబుతున్నారు. చంద్ర‌బాబు త‌న‌ను అవ‌మానిస్తున్నార‌ని స‌న్నిహితుల వ‌ద్ద ఆగ్ర‌హం
వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. అందుకే ఇటీవ‌ల ఆయ‌న టీడీపీకి దూరంగా ఉంటున్నారు. త‌న‌కు ఒక్క మాట కూడా చెప్ప‌కుండా కేంద్ర‌మాజీ మంత్రి కిశోర్ చంద్ర‌దేవ్‌ను పార్టీలోకి చేర్చేకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించ‌డంపై అశోక్ ఆగ్ర‌హంగా ఉన్నారు.

పార్టీలో ఇంత సీనియ‌ర్‌ను అయిన త‌న‌ను మ‌రీ ఇంత చుల‌క‌న‌గా చూస్తారా అని ఆయ‌న ఆగ్ర‌హంగా ఉన్నారు. ఢిల్లీ వ్య‌వ‌హారాల్లోనూ సుజ‌నాచౌద‌రి, గ‌ల్లా జ‌య‌దేవ్‌, ముర‌ళీమోహ‌న్, సీఎం ర‌మేష్ లాంటి జూనియ‌ర్ల‌కే ప్రాధాన్య‌త ఇస్తూ త‌న‌ను ప‌క్క‌న‌పెట్టార‌న్న భావ‌న‌తో గ‌జ‌ప‌తిరాజు ఉన్నారు. మూల సిద్ధాంతాల‌కే విరుద్దంగా పార్టీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు కూడా ఆయ‌న్ను నొప్పించినట్టు చెబుతున్నారు.

ఇటీవ‌ల త‌న సొంత పార్ల‌మెంట్ నియోజ‌వ‌క‌ర్గ ప‌రిధిలో జ‌రిగిన భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి కూడా అశోక్ గ‌జ‌ప‌తిరాజు హాజ‌రుకాలేదు. కేంద్ర మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేసే స‌మ‌యంలోనూ చంద్ర‌బాబుకు, అశోక్ గ‌జ‌ప‌తిరాజుకు మ‌ధ్య విబేధాలు వ‌చ్చాయి. ఇప్ప‌టికే నేత‌లు ఒక్కొక్క‌రుగా పార్టీని వీడుతున్న నేప‌థ్యంలో అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ్య‌వ‌హారం టీడీపీనేత‌ల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది.