నాకు ద‌క్క‌నిది లోకేష్‌కు మాత్ర‌మే ద‌క్కాలి- ఫిరాయింపు ఎమ్మెల్యే

టీడీపీ అధిష్టానం మ‌న‌సు గెలిచేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఎస్వీ మోహ‌న్ రెడ్డి ప‌డుతున్నంత క‌ష్టం మ‌రే ఫిరాయింపు ఎమ్మెల్యే కూడా ప‌డ‌డం లేదు. చిన్న అవ‌కాశం వ‌స్తే చాలు అల్లుకుపోతున్నారు మోహ‌న్ రెడ్డి. చంద్ర‌బాబును ఎవ‌రైనా దూషించినా, వ‌ర్మ లాంటి వారు సినిమా పాటల్లో చంద్ర‌బాబును కించ‌ప‌రిచినా తొలుత కేసు పెట్టేది ఎస్వీ మోహ‌న్ రెడ్డే అని అంద‌రూ ఫిక్స్ అయిపోయారు.

అలాంటి ఎస్వీమోహ‌న్ రెడ్డికి ఇప్పుడు క‌ర్నూలు ఎమ్మెల్యే టికెట్ ద‌క్కుతుందా లేదా అన్న అనుమానం ఉంది. క‌ర్నూలు ఎమ్మెల్యే టికెట్ కోసం టీజీ భ‌ర‌త్ కాచుకుని ఉన్నారు. చంద్ర‌బాబు కూడా ఫిరాయింపు మోహ‌న్ రెడ్డి కంటే టీజీ కుటుంబానికే ప్రాధాన్య‌త ఇవ్వాల్సిన అనివార్య‌త ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి లోకేష్ నామ‌జపం మొద‌లుపెట్టారు ఎస్వీ మోహ‌న్ రెడ్డి.

క‌ర్నూలు నుంచి నారా లోకేష్ పోటీ చేయాల‌ని కోరారు. లోకేష్ పోటీ చేస్తానంటే సీటు త్యాగం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. లోకేష్ కోసం సీటు త్వాగం చేయ‌డ‌మే కాదు మ‌రొక చోట టికెట్ కూడా అడ‌గ‌బోన‌ని తెలిపారు.

అయితే క‌ర్నూలు నుంచి లోకేష్ పోటీ చేస్తే స‌రేన‌ని.. అలా కాకుండా మ‌రొక‌రికి క‌ర్నూలు టికెట్ కేటాయిస్తే మాత్రం ఊరుకోబోన‌న్నారు. ప‌రోక్షంగా టీజీ భ‌ర‌త్‌కు టికెట్ ఇస్తే తాను అంగీక‌రించ‌బోన‌ని హెచ్చ‌రించారు.

అయినా … ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒక‌వేళ టికెట్‌ను టీజీ భ‌ర‌త్‌కో, మ‌రొక‌రికో చంద్ర‌బాబు ఇచ్చినా ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఏమీ చేయ‌లేర‌న్న‌ది లోక‌ల్ టాక్. అటు వైసీపీలోకి దారి లేదు. జ‌న‌సేన ఊసు లేదు. ఏం చేస్తాం?.