పవన్‌కూ గర్జన దెబ్బ!

“ నాకు కులాలు లేవు. మతాలు లేవు. మానవులు… సమాజం తప్ప. అందుకే నేను ఏ కులానికి చెందిన వాడిగా చెప్పుకోను” ఈ మాటలు అన్నది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ మాటలు వెండితెరపై బాగుంటాయేమో కానీ రాజకీయాల్లో మాత్రం బాగుండవని రాజకీయ హీరోకి అర్థం కాలేదు.

ఏ కుల సంఘం మీటింగ్‌కు పిలిచినా తప్పక అక్కడికి హాజరయ్యి “ఏ కులం వాడిని కాదు” అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎవరికీ కాకుండా పోయేలా పరిస్థితి మారిందంటున్నారు జనసైనికులు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బీసీ గర్జనకు వచ్చిన వారిలో ఎక్కువ మంది యువకులు, విద్యార్థులు, మహిళలే కావడం గమనార్హం.

ఇన్నాళ్లు తన బలం, బలగం…. యువకులు, విద్యార్థులు అని అత్యంత నమ్మకంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈ గర్జనలో వారే ఎక్కువగా కనిపించడం జనసేన నాయకులకు, కార్యకర్తలకు ఆందోళన కలిగిస్తోంది.

పవన్ కళ్యాణ్ తాను ఏం చేస్తాను అనేది ముందుగా చెప్పనని, చేసి చూపిస్తాను అంటూ ప్రతి సమావేశంలోనూ ప్రకటిస్తారు. ఇలాంటి ప్రకటనలకు రాజకీయాలలో స్థానం ఉండదని, ప్రజల ఆశలు, కలలు, కష్టాలు తీర్చే వారిని ఆదరిస్తారని పవన్ కళ్యాణ్ కి ఇంకా తెలిసి రాలేదని రాజకీయ పండితులు అంటున్నారు.

బీసీ గర్జనలో వైసీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనే అంశాలని  వైయస్ జగన్ స్పష్టం చేశారు. అలాగే తాను చేయలేని పనిని కూడా అంతే స్పష్టంగా ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు చేయడం, ప్రజలను ఆదుకునేందుకు ఈ కార్యక్రమాలు చేపడతామని చెప్పడం ప్రతి రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అని, తమ నాయకుడు మాత్రం ఆ పని చేయడం లేదని జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బీసీ గర్జన చూసిన తర్వాత అయినా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ తన వైఖరిలో మార్పు తెచ్చుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.