Telugu Global
Others

నిషేధించాల్సింది మద్యాన్ని కాదు కల్తీని 

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కల్తీ మద్యం తాగి 116 మంది మరణించడం సంపూర్ణ మధ్య నిషేధం విధించాలా లేదా మితంగా, సురక్షిత పద్ధతిలో మద్యం సేవించాలా అన్న చర్చకు మళ్లీ తెరలేపింది. అనేక దేశాలలో అల్పాదాయ వర్గాల వారు, దిగువ మధ్యతరగతి వారు విచ్చలవిడిగా, చౌకగా దొరికే మద్యం సేవించి జబ్బుల బారిన పడే వారు, మృతి చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారని అనేక అధ్యయనాల్లో తేలింది. అధిక ఆదాయం ఉన్న వారు సేవించే మద్యం మేలు […]

నిషేధించాల్సింది మద్యాన్ని కాదు కల్తీని 
X

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కల్తీ మద్యం తాగి 116 మంది మరణించడం సంపూర్ణ మధ్య నిషేధం విధించాలా లేదా మితంగా, సురక్షిత పద్ధతిలో మద్యం సేవించాలా అన్న చర్చకు మళ్లీ తెరలేపింది. అనేక దేశాలలో అల్పాదాయ వర్గాల వారు, దిగువ మధ్యతరగతి వారు విచ్చలవిడిగా, చౌకగా దొరికే మద్యం సేవించి జబ్బుల బారిన పడే వారు, మృతి చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారని అనేక అధ్యయనాల్లో తేలింది.

అధిక ఆదాయం ఉన్న వారు సేవించే మద్యం మేలు రకమైందైనందువల్ల వారికి ఇలాంటి ఇబ్బందులు తక్కువ. కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయే వారిలో పేదలు, దిక్కుమొక్కు లేని వారే ఎక్కువ. ఇలాంటి దుర్ఘటనలు జరిగిన తర్వాత పరిణామాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి. కల్తీ మద్యం బారిన పడిన వారిని బుజ్జగించేందుకు ప్రభుత్వాలు తృణమో పణమో నష్ట పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటాయి. ఆ రకంగా ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంటాయి. అధికాదాయం గల వారు ఇదే రకంగా మృత్యువాత పడితే ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తుందా?

దురదృష్టకరమైన కల్తీ మద్యం తెచ్చే ఇబ్బందులను జనం కూడా రెండు రోజులు అయ్యో అని తర్వాత మరచిపోతారు. మృతుల తల్లులో, భార్యలో విపరీతంగా రోదించే దృశ్యాలు, ప్రభుత్వం పరిహారం ప్రకటించడం, కల్తీ మద్యానికి కారకులనుకున్న కొంతమందిని అరెస్టు చేయడం – అక్కడితో ఆ కథ ముగుస్తుంది.

అయితే ఈ సారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ విషాదానికి ఓ కొత్త కోణం జోడించారు. అధికారపక్షాన్ని వ్యతిరేకించే వారు కల్తీ మద్యం తయారు చేయించి ఈ విషాదానికి కారకులవుతున్నారేమో పరిశీలించడానికి ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. మరణంలో కూడా పేదలు ఏదో ఒక రాజకీయ వర్గానికి ఉపయోగపడాలన్న మాట.

మద్య నిషేధం ఏ మేరకు ఉపయుక్తంగా ఉంటుందన్న విషయం మీద మనదేశంలో సుదీర్ఘ కాలంగా, వివాదాస్పదంగా చర్చ జరుగుతూనే ఉంది. రాజకీయ నాయకులు ఈ బెడద నివారించడానికి కల్తీ మద్యాన్ని నిరోధించే ప్రయత్నాలు చేయరు కానీ సులభమైన మద్య నిషేధం కోసం ప్రయత్నం చేస్తారు. మద్యపానంపై నైతిక పాఠాలు వల్లిస్తారు. మద్యానికి బానిసలైన వారి కుటుంబాలు ఎలా బాధ పడుతున్నాయో ఏకరువు పెడ్తారు. అందువల్ల మద్య పానాన్ని నిషేధించాలంటారు. డబ్బున్న ఆసాములు నిషేధం ఉన్నప్పుడు సైతం మేలి రకం మద్యం సంపాదించగలుగుతారు.

పేదలకు ప్రభుత్వం అనుమతించే “నాటు సారా” అందుబాటులో ఉండదు. అందుకే వారు అక్రమ మద్యం మీద ఆధారపడతారు. పన్నులు ఎగవేయడానికి తయారయ్యే అక్రమ మద్యం సేవించడంవల్లే జనం మృత్యువాత పడ్తున్నారని అనేక సార్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. చౌకగా దొరికే మద్యం చాలా అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతుంది.

ఇందులో మెథనాల్, బ్యాటరీల్లో వినియోగించే ఆమ్లం, చర్మ సంబంధమైన పదార్థాలు చాలా ఎక్కువ పరిమాణంలో వాడతారు. వీటి పరిమాణం ఎంత అనే దాని మీదే అవి ఎంత ప్రాణాంతకమో ఆధారపడి ఉంటుంది. నాటు సారా లేదా గుడుంబా కొన్ని సార్లు ప్రాణాలు తీయకపోయినా కొన్ని అవయవాలను నాశనం చేస్తుంది. ఇది అంధత్వంతో సహా అనేక వైకల్యాలకు దారి తీస్తుంది.

కల్తీ మద్యం తాగి ప్రాణాలు పోగొట్టుకోవడం వెనక ప్రత్యర్థుల కుట్ర ఉండి ఉంటుంది అని వాదిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి లాగే మరి కొంత మంది వాస్తవాన్ని పరిశీలించకుండా మద్య నిషేధం విధించాలని గట్టిగా కోరుతూ ఉంటారు. నిజానికి ఒక రాష్ట్రంలో ప్రభుత్వం ఆమోదం ఉన్న నాటు సారా అందుబాటులో ఉండడాన్ని మరింత “క్లిష్టతరం” చేసింది.

అయితే ఇది మన దేశంలో తయారైన విదేశీ మద్యం వాడకం పెంచడానికేనన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇవన్నీ నిరాశావాదం, దిక్కుతోచని చర్యలే తప్ప వినియోగదారులకు ఉపకరించేవి కావు. మద్యం సేవించకూడదు అన్నది వాస్తవ దూరమైన వ్యవహారం. రాజకీయ ప్రయోజనాలకోసం, పాలనా పరంగా సులభ మార్గం ఎంచుకోవడానికి బదులు నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచడమే వివేకవంతమైంది. అది జరగాలంటే ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అక్రమంగా మద్యం తయారు చేసే నేరస్థుల మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. నాణ్యతా పరిరక్షణ మీద శ్రద్ధ తీసుకోవాలి.

అక్రమ మద్యంవల్ల ముంబైలో 2015లో 106 మంది మరణించారు. 2011లో పశ్చిమ బెంగాల్ లోని సంగ్రాం పూర్ లో 170 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు అన్ని రాష్ట్రాలలో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల్లో చేరని మరణాలు చాలానే ఉంటాయి.

ఆల్కహాల్ రాష్ట్రాల జాబితాలోని అంశం కనక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దుర్ఘటనలను నివారించడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. తమిళనాడులో 2001 నుంచి ఆల్కహాల్ టోకు అమ్మకాలు ప్రభుత్వం అధీనంలోనే జరుగుతున్నాయి. 2014-15 నుంచి అక్కడ ప్రభుత్వ సంస్థ ద్వారా చౌక మద్యం సరఫరా చేస్తున్నారు. పేదలకు సురక్షితమైన మద్యం అందుబాటులో ఉంచడానికి మిగతా రాష్ట్రాలు తమిళనాడును ఆదర్శంగా తీసుకోవచ్చు.

దీనికి బదులు నైతిక ధర్మ పన్నాలు వల్లించడం కపటం కిందే లెక్క. లేకపోతే కల్తీ మరణాలవల్ల భారీ సంఖ్యలో మరణాలను నివారించడం అసాధ్యంగానే ఉంటుంది.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  18 Feb 2019 8:16 PM GMT
Next Story