Telugu Global
NEWS

హరీష్ కు ఏ దారీ లేకుండా చేశారా?

తన్నీరు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుముక. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి తలలో నాలుక. తొలి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పగలనకా.. రాత్రనకా కష్టపడిన ప్రజా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర సమితిలో నెంబర్ టు స్థానం కోసం పోటీ పడిన వారిలో హరీష్ రావు ఒకరు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నెంబర్ టు మాట దేవుడెరుగు హరీష్ రావు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారో ఎవరికీ […]

హరీష్ కు ఏ దారీ లేకుండా చేశారా?
X

తన్నీరు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుముక. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి తలలో నాలుక. తొలి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పగలనకా.. రాత్రనకా కష్టపడిన ప్రజా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర సమితిలో నెంబర్ టు స్థానం కోసం పోటీ పడిన వారిలో హరీష్ రావు ఒకరు.

అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నెంబర్ టు మాట దేవుడెరుగు హరీష్ రావు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారో ఎవరికీ తెలియడం లేదు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ హరీష్ రావు ఇప్పుడు కూరలో కరివేపాకు అయిపోయారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం నిర్ణయించారు. పార్టీలో సీనియర్ , భారీ మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించిన హరీష్ రావు కు మాత్రం కొత్త క్యాబినెట్ విస్తరణ లో స్థానం దక్కలేదు.

పార్టీకి, మరీ ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు, తన మేనమామ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు వీర విధేయుడు గా పేరు తెచ్చుకున్న హరీష్ రావు ఇప్పుడు ఏ దారీ తెన్నూ లేక నాలుగు రోడ్ల కూడలిలో ఒంటరిగా నిలిచిపోయారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరీష్ రావు కాంగ్రెస్ లో చేరతారని, కెసిఆర్ కు ధీటుగా తెలంగాణలో హరీష్ రావును తయారు చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో నిజమెంతో… అబద్ధమెంతో తెలియదు కానీ… వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత హరీష్ రావు మరింత విధేయుడిగా పార్టీ కోసం పని చేయడం ప్రారంభించారు. భవిష్యత్తులో తన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే. తారకరామారావు కు ఎక్కడ అడ్డు తగులుతాడు అని అనుకున్నారో.. లేక మరే కారణమో తెలియదు గాని హరీష్ రావు కు మాత్రం మంత్రివర్గంలో స్ధానం లేకుండా చేశారు.

తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తప్ప ఏ ఇతర పార్టీ బలంగా లేదు. దీంతో హరీష్ రావు నచ్చినా… నచ్చకపోయినా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండాల్సిందే.

First Published:  18 Feb 2019 8:22 PM GMT
Next Story