మ‌ల్లారెడ్డి కోరిక నెర‌వేర్చిన ఆ దేవ‌త ఎవ‌రు?

మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి మంత్రి కాబోతున్నారు. ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌ల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలిచారు. తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఎంపీగా విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లోకి వ‌చ్చారు. ఇప్పుడు మంత్రి అయ్యారు.

గ‌త ఎన్నిక‌ల ముందే ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాల‌నేది ఆయ‌న క‌ల‌. మ‌ల్కాజ్ గిరి నుంచి మ‌ళ్లీ ఎంపీగా గెలిస్తే లాభం లేద‌ని మ‌ల్లారెడ్డి త‌లిచారు. కేంద్రంలో టీఆర్ఎస్ చేరినా… త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాద‌ని తెలిసి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గెలిచారు. ఇప్పుడు మంత్రి అయ్యారు.

మంత్రి కావాలనే కోరిక‌ను మ‌ల్లారెడ్డి గ‌త ఫిబ్ర‌వ‌రిలోనే బ‌య‌ట‌పెట్టారు. సీఎం కేసీఆర్‌తో పాటు మేడారం స‌మ్మ‌క్క సార‌క్క మొక్కుల కోసం వెళ్లిన మ‌ల్లారెడ్డి కేసీఆర్ స‌మ‌క్షంలోనే ముచ్చ‌ట్లు జ‌రిగాయి.

మ‌ల్ల‌న్న ఏం కోరిక కోరావ‌ని కేసీఆర్ అడ‌గ్గానే మంత్రి కావాల‌ని కోరుకున్న‌ట్లు తెలిపారు. స్టేటా….సెంట్ర‌లా అని అడ‌గ్గానే  స్టేటే అని జ‌వాబు ఇచ్చారు. అంతకుముందు మేడారం వ‌చ్చి ఎంపీగా గెల‌వాల‌ని కోరుకుంటే… ఎంపీ అయ్యాన‌ని… ఈసారి మంత్రి కావాల‌ని కోరుకున్న‌ట్లు చెప్పారు. దీంతో సీఎం వెంట‌నే ప‌క్క‌నే ఉన్న నాయినితో పాటు ఇత‌ర మంత్రుల‌తో చూశావా…నీ ప‌ద‌వికి ఎస‌రు పెడుతున్నార‌ని అప్ప‌ట్లో జోక్ వేశారు. అన్న‌ట్లుగానే నాయిని ప‌ద‌వికి మ‌ల్లారెడ్డి ఎస‌రు పెట్టారు. నాయిని ప్లేస్‌లో మంత్రి ప‌ద‌వి కొట్టేశారు.