శ్రీనివాస్…. ఓ అపరిచితుడు

గుంటూరు జిల్లా మంగళగిరిలో తన ప్రియురాలిని హత్య చేసిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జ్యోతిని వదిలించుకోవడానికే శ్రీనివాస్ పథకం ప్రకారం తన స్నేహితుల సహకారంతో హత్య చేశాడని పోలీసులు ఇప్పటికే నిర్థారించారు.

గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న జ్యోతి తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతోనే శ్రీనివాస్ తన స్నేహితుడు పవన్‌తో కలసి హత్య చేశాడు. తర్వాత అనుమానం రాకుండా తనపై కూడా దాడి చేయించుకున్నాడు. అయితే పోలీసులకు మొదటి నుంచి తప్పుడు సమాచారం ఇచ్చాడు.

ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న శ్రీనివాస్‌ను ప్రశ్నించినా సరైన సమాధానాలు చెప్పట్లేదు. దీంతో అతడి ప్రవర్తనను గమనించడానికి పోలీసులు రహస్యంగా ఒక సీసీ కెమేరా ఏర్పాటు చేశారు.

పోలీసులు ఉన్నప్పుడు ఒకలాగ.. లేని సమయంలో మరోలా ప్రవర్తిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా ఎవరూ లేని సమయంలో సెల్‌ఫోన్లో యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడని.. ఎవరైనా వస్తే మాత్రం కళ్లు మూసుకొని పడుకుంటున్నాడని సీసీ కెమేరాల్లో నమోదైంది.

దీంతో పోలీసులు అతడి ప్రవర్తన సరిగా లేదని.. అతడో మోసగాడనే నిర్థారణకు వచ్చారు. శ్రీనివాస్ కోలుకున్న తర్వాత అతడిని అదుపులోని తీసుకొని పూర్తి స్థాయిలో విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు.