అనిల్‌ అంబానీకి షాక్‌… మూడు నెలల జైలు శిక్ష విధిస్తాం – సుప్రీం కోర్టు

ఎరిక్సన్ ఇండియా కేసులో అనిల్ అంబానీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నాలుగు వారాల్లోగా రూ. 453 కోట్లను ఎరిక్సన్ కంపెనీకి చెల్లించాలని సుప్రీం కోర్టు అనిల్ అంబానీని ఆదేశించింది. డబ్బు చెల్లించని పక్షంలో 3 నెలల పాటు జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది.

కోర్టు ధిక్కరణ కింద అనిల్‌తో పాటు రిలయన్స్ టెలికాం చైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్‌ఫ్రా చైర్ పర్సన్ చాయ నిరానీకి కోటి చొప్పున జరిమానా విధించింది. దీన్ని కూడా నాలుగు వారాల్లో చెల్లించాలని ఆదేశించింది.

అలా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు అనిల్ అంబానీ చెప్పిన క్షమాపణను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

గతంలో ఎరిక్సన్ సంస్థకు డబ్బు చెల్లిస్తామని సుప్రీం కోర్టుకు చెప్పిన అంబానీ ఆ తర్వాత కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద అనిల్‌పై ఎరిక్సన్ సంస్థ కోర్టులో కేసు వేసి…. మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఎరిక్సన్ సంస్థకు అనిల్ గ్రూప్ 550 కోట్లు చెల్లించాల్సి ఉంది.