రాహుల్ రాక‌… మారుతుందా చేతి రాత‌

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో ప‌ర్యటిస్తున్నారు. ప్రత్యేక హోదా నినాదంతో ప్రజ‌ల్లోకి వెళ్లి త‌మ చేతి రాత‌ను మార్చుకోవాల‌న్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయ‌కుల క‌ల ఫ‌లిస్తుందో లేదో తేల్చుకుందుకు ఈ ప‌ర్యట‌న ఉప‌క‌రిస్తుంద‌ని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

రానున్న ఎన్నిక‌ల్లో క‌నీసం ప‌ది స్ధానాలైనా గెలుచుకుని పూర్వ వైభ‌వానికి ప్రయ‌త్నించాల‌న్నది కాంగ్రెస్ శ్రేణుల ఆశ‌. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల్లో మాత్రం ఇంకా రాష్ట్ర విభ‌జ‌న చేసింది కాంగ్రెప్ పార్టీ వారే అనే ఆగ్రహం పోలేదు. దీంతో ఈసారి కేంద్రంలో తాము అధికారంలోకి వ‌స్తే ప్రత్యేక హోదా ఇస్తామ‌నే నినాదంతో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో ప‌ర్యటిస్తున్నారు.

తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ గ‌తంలో హామీ ఇచ్చింది. ఆ హామీని తుంగ‌లో తొక్కింద‌నే కోపం కూడా ఆంధ్రప్రదేశ్ వాసుల్లో బ‌లంగా ఉంది. దీంతో ఏ తిరుప‌తి నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజ‌ల‌కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందో అదే తిరుప‌తి నుంచి తాము కూడా ప్రత్యేక హోదా హామీ ఇచ్చి దాన్ని నెర‌వేరుస్తామ‌ని కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు.

ఇంత‌కు ముందు ప్రత్యేక హోదా విష‌యంలో ఢిల్లీలో ధ‌ర్మ పోరాట దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేప‌డుతున్న ఈ కార్యక్రమానికి హాజ‌రు కావ‌డం లేదు‌. దీనికి కార‌ణం అది తెలుగుదేశం ప్రభుత్వం చేప‌ట్టింద‌ని, అందుకే త‌మ నాయ‌కులు ఢిల్లీలో ఆ కార్యక్రమానికి హాజ‌రు అయ్యార‌ని అంటున్నారు.

అయితే తిరుప‌తిలో తాము చేప‌డుతున్న కార్యక్రమం మాత్రం పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాబ‌ట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఎవ్వరూ రావ‌డం లేదని సూత్రీక‌రిస్తోంది. ఈ వాద‌న‌ను ప్రజ‌లు మాత్రం అంగీక‌రించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

పోరాటం ఒకే అంశం మీద అయిన‌ప్పుడు రెండు పార్టీలు క‌ల‌వ‌కుండా… ఒక‌టి ప్రభుత్వ కార్యక్రమం… మ‌రొక‌టి పార్టీ కార్యక్రమం అంటూ పేర్లు పెట్టడ‌మేమిట‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. గ‌తంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాల‌కు రాహుల్ గాంధీ హాజ‌ర‌య్యారు.

అయితే గ‌డ‌చిన ఐదు సంవ‌త్పరాల‌లో పార్టీ ప‌ట్ల ప్రజ‌ల్లో సానుభూతి పెరిగింద‌ని, ఈ సారి రాహుల్ గాంధీ ప‌ర్యట‌న విజ‌య‌వంతం అవుతుంద‌ని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. రానున్న ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ క‌నీస‌ స్ధానాలైనా గెలిచేందుకు ఈ ప‌ర్యట‌న క‌లిసి వ‌స్తుంద‌ని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. చూడాలి…. కాంగ్రెస్ గుర్రం ఎగురుతుందో….!? లేదో..!?.