ఏవీ సుబ్బారెడ్డి దారెటు ?

క‌ర్నూలు రాజ‌కీయం వేడెక్కింది. ఓవైపు గౌరు చ‌రితారెడ్డి పార్టీ మారుతార‌నే వార్త‌లు విన్పిస్తున్న నేప‌థ్యంలో టీడీపీ నుంచి కూడా జంప్‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. నంద్యాల,క‌ర్నూలు సీటు విష‌యంలో పంచాయ‌తీలు న‌డుస్తున్నాయి. నంద్యాల టికెట్ ఇవ్వ‌క‌పోతే పార్టీ మారాల‌ని ఏవీ సుబ్బారెడ్డి ఆలోచ‌న‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో గురువారం కార్య‌క‌ర్త‌ల‌తో ఏవీ సుబ్బారెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. టీడీపీలో త‌మ‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని పార్టీ మారాల‌ని కార్య‌క‌ర్త‌లు ఏవీపై ఒత్తిడి తెచ్చిన్నట్లు తెలుస్తోంది. చంద్ర‌బాబు త‌న‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని… నంద్యాల టికెట్ ఇస్తార‌ని ఏవీ కార్య‌క‌ర్త‌లతో అన్న‌ట్లు తెలుస్తోంది.

చంద్ర‌బాబు టికెట్ ఇవ్వ‌క‌పోతే ఏవీ జంప్ అవుతార‌ని నంద్యాల‌లో టాక్ విన్పిస్తోంది. ఇటు అమ‌రావ‌తిలో క‌ర్నూలు జిల్లా స‌మావేశానికి ఏవీ వ‌చ్చారు. త‌న‌కు నంద్యాల టికెట్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌ని చెప్పుకొచ్చారు. మ‌రోవైపు నంద్యాల స‌ర్వేలో మాత్రం భూమా బ్ర‌హ్మ‌నంద రెడ్డికి అనుకూలంగా వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో ఏవీకి టికెట్ ఆశ‌లు గ‌ల్లంతే అని తెలుస్తోంది.

మ‌రి సుబ్బారెడ్డి పార్టీ మారే ముహూర్తం ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. మ‌రోవైపు క‌ర్నూలు ఎంపీ సీటుతో పాటు ఎమ్మిగ‌నూరు టికెట్ తాజా ఎంపీ బుట్టా రేణుకకు ద‌క్కే సూచ‌న‌లు క‌న్పించ‌డం లేదు. దీంతో ఆమె ఏం చేస్తార‌నేది కూడా త్వ‌ర‌లోనే క్లారిటీ రాబోతుంది.

క‌ర్నూలు సీటుపై కూడా పీట‌ముడి కొన‌సాగుతోంది. ఎస్వీ మోహ‌న్‌రెడ్డికి టికెట్ ఇస్తాన‌ని లోకేష్ ప్రామిస్ చేశారు. కానీ స‌ర్వేలు మాత్రం టీజీ వెంక‌టేష్‌కు అనుకూలంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు చంద్ర‌బాబు ఎటు వైపు ఉంటార‌నేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

మొత్తానికి క‌ర్నూలు టికెట్ టీడీపీలో క‌ల‌కలం రేప‌డం ఖాయం. పార్టీ టికెట్ ద‌క్క‌ని నేత ఏం చేస్తార‌నేది ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది.

మ‌రోవైపు కర్నూలు ఎంపీగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల ఎంపీగా ఎస్పీవై రెడ్డి కూతురు లేదా అల్లుడికి ఇస్తార‌ని తెలుస్తోంది. పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి గా కేఈ శ్యామ్‌, డోన్‌లో కేఈ ప్రతాప్‌,ఆలూరులో కోట్ల సుజాత‌మ్మ‌, ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ, శ్రీశైలం నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వర రెడ్డి, బనగానపల్లె నుంచి బీసీ జనార్దన్ రెడ్డికి టికెట్లు ఖ‌రారైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మంత్రాలయం, ఆదోని, కోడుమూరు, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల స్థానాలు ఇంకా కొలిక్కి రాలేద‌ని తెలుస్తోంది.