బెంగళూరు ఎయిర్‌షోలో భారీ అగ్నిప్రమాదం…. 150 కార్లు దగ్దం

బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ఎయిర్‌షోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి పార్కింగ్ ప్రదేశంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 150పైగా కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాయి.

బెంగళూరు యలహంక ఎయిర్‌బేస్‌లో జరుగుతున్న ఏయిర్ షోకు వచ్చిన అతిథులు తమ కార్లను పలు ప్రాంతాల్లో పార్క్ చేశారు. గేట్ నెంబర్ 5కు సమీపంలో తొలుత ఒక కారులో మంటలు రాజుకున్నాయి. ఆ ప్రదేశమంతా ఎండుగడ్డి దట్టంగా ఉండటంతో మంటలు అత్యంత వేగంగా పక్కనున్న కార్లకు వ్యాపించాయి. కార్ల టైర్లు పేలడంతో భారీ శబ్ధం చోటు చేసుకుంది. దీంతో ప్రదర్శనకు వచ్చిన వారు భయాందోళనలతో అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు.

మరోవైపు అగ్ని ప్రమాదం సంభవించిన ప్రదేశానికి సమీపంలోనే కొన్ని విమానాలను కూడా నిలిపి ఉంచారు. విషయం తెలుసుకొని వాటిని అక్కడి నుంచి పక్కకు తరలించారు. భారీ అగ్ని ప్రమాదంలో ఎంత మందికి గాయాలయ్యాయో తెలియరాలేదు.

ఇక ఈ ప్రమాదంతో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రదర్శనకు అంతరాయం కలిగింది. క్షతగాత్రులు ఎవరైనా ఉంటే వారిని తరలించేందుకు 7 అంబులెన్సులను కూడా సిద్దం చేశారు.