పొత్తు లేదని…. పవన్ సూటిగా చెప్పడే!

తన పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని… జనసేన అధిపతి పవన్ కల్యాణ్ సూటిగా, స్పష్టంగా చెప్పడం లేదు…. అని అంటున్నారు పరిశీలకులు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఉండవచ్చు అని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వరస ట్వీట్లలో అటు తెలుగుదేశం పార్టీని, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు పవన్ కల్యాణ్.

తన పార్టీ వైఎస్సార్సీపీతో పొత్తు పెట్టుకుంటుందని తెలుగుదేశం, కాదు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. తనకూ సొంతంగా పత్రిక, టీవీ చానల్ ఉండాల్సింది అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

అయితే ఆల్రెడీ పవన్ కల్యాణ్ కు అనుకూలంగా రెండు మూడు టీవీ చానళ్లు పని చేస్తూ ఉన్నాయి. ఆ సంగతలా ఉంటే.. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు సోలోగా పోటీ చేస్తాము..కమ్యూనిస్టు పార్టీలను మాత్రం కలుపుకుపోతాము అని సూటిగా ఒక్క ట్వీట్ పెట్టేసి ఉంటే సరిపోయేది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం అలాంటి పని ఏమీ చేయలేదు.

ఏదేదో చెప్పాడు కానీ.. అసలు విషయాన్ని మాత్రం పవన్ కల్యాణ్ ప్రస్తావించలేదని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు.

జగన్‌ మీద కూడా టీడీపీ విమర్శలు చేసినప్పుడు…. వైసీపీ, బీజేపీ, జనసేన ల పొత్తు ఉంటుందని టీడీపీ నాయకులు అన్నప్పుడు జగన్‌ స్పష్టంగా ప్రకటన చేశాడు. ఏ పార్టీతోనూ కలిసి ఎన్నికల్లో పోటీ చేయమని కరాఖండీగా చెప్పేశాడు.

పవన్‌ కూడా అలాగే తేల్చేస్తే ఇక ఊహాగానాలకు తావుండదు కదా! కానీ పవన్‌ అలా చేయడం లేదు. పవన్ కల్యాణ్ ఇంకా అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాడని అభిప్రాయపడుతూ ఉన్నారు. తెలుగుదేశం తో పొత్తు ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.

మరోవైపు జనసేన పార్టీ అభ్యర్థుల నుంచి టికెట్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తూ ఉంది. మరో రెండు రోజుల్లో అందుకు సంబంధించిన గడువు కూడా ముగియనుంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ పొత్తుకు వెళ్తే వ్యవహారం మరింత ప్రహసనంగా మారిపోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.