రఘువీరా గారూ…. మీ అనువాదం సూపర్ !

ఒకరు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. మరొకరు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ప్రసంగానికి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అనువాదం చేశారు. వేదిక మీద వీరిద్దరినీ చూసిన కాంగ్రెస్ వారికి కన్నుల పండుగ గానే ఉంటుంది.

అసలు విషయం లోకి వస్తేనే “అబ్బే ఏం లేదు” అనిపిస్తుంది. మీకు నమ్మకం కలగకపోతే తిరుపతిలో జరిగిన పార్టీ భరోసా యాత్ర బహిరంగ సభను ఓ సారి చూడండి. సభ అయిపోయింది కదా చూడడం ఎలాగా అనుకుంటున్నారా… అయితే యూట్యూబ్ లో చూడండి. మరోసారి ఎప్పుడైనా రఘువీరా రెడ్డి అనువాదకుడుగా ఉన్న సభకు వెళ్లాలంటే భయం వేస్తుంది. అనువాదం చేసేందుకు పరభాష రాకపోయినా…. మాతృభాష అయినా రావాలి కదా! అని ఆ సభకు హాజరైన కాంగ్రెస్ సీనియర్ నాయకులే వ్యాఖ్యానించారంటే అనువాదం ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునంటున్నారు.

తిరుపతిలో జరిగిన భరోసా యాత్ర బహిరంగ సభ చూసిన వారికి, విన్న వారికి అనువాద కళ పట్ల ఏవగింపు కలుగుతుందంటున్నారు.

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి గతంలో అనువాదకుడిగా పనిచేసిన అనుభవం లేదు. అయినా…ఈ పనికి ముందుకు వచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అనువాదకులుగా వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటివారు వ్యవహరించే వారు. ముఖ్యఅతిథి ఉపన్యాసం కంటే కూడా అనువాదకుల ఉపన్యాసం ఆకట్టుకునేది. ముఖ్యఅతిథి మాట్లాడిన వాటి కంటే ఒకటి రెండు ఎక్కువ స్థానిక అంశాలను జోడించి వారు అనువాదం చేసే వారు.

దీంతో సభకు వచ్చిన స్థానికులకు…. ముఖ్యఅతిథిగా వచ్చిన పెద్ద నాయకులు స్థానిక సమస్యలపై స్పందిస్తున్నారని భావించేవారు. ఇటీవల జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూడా ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అనువాదకుడిగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు దాసోజు వ్యవహరించారు. ఆ అనువాదానికి ముచ్చటపడిన రాహుల్ గాంధీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా దాసోజు కు ఏఐసిసిలో పెద్ద పదవిని ఇచ్చారు.

ఇక రఘువీరారెడ్డి తిరుపతిలో చేసిన అనువాదం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రాహుల్ గాంధీ ప్రసంగం లో చూపించిన ఆవేశాన్ని కూడా రఘువీరా తన అనువాదంలో చూపించ లేకపోయారు. పదో తరగతి విద్యార్ధి తన ముందున్న టీచర్ కి పాఠం అప్పగించినట్లుగా రఘువీరా తన అనువాదాన్ని అప్పగించారు.

ఈ అనువాదంతో సభకు వచ్చిన వారే కాక కాంగ్రెస్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూడా తలలు పట్టుకున్నారు. రానున్న రోజుల్లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ప్రచార సభల్లో రాహుల్ గాంధీకి అనువాదకుడుగా మరొకరిని నియమించుకోకుంటే…. హోదా మాట దేవుడెరుగు…. పార్టీకి 10 ఓట్లయినా పడవని, కార్యకర్తలు కూడా ఓటేయరని విశ్లేషకులు అంటున్నారు.