వాళ్లని కట్టడి చేయండి: సినీ పెద్దలకు బాబు

“ సినిమా పరిశ్రమకు చెందిన సీనియర్ నటులు, సాంకేతిక నిపుణులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. వారు కలుస్తున్న ప్రచారం రోజురోజుకు ఎక్కువవుతోంది. మీరు వాళ్ళని కట్టడి చేయండి” ఇదీ సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకులు, నిర్మాతలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన హెచ్చరిక లాంటి విజ్ఞప్తి.

గడిచిన పది రోజులుగా తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలో చేరడం… లేదూ సంఘీభావం తెలపడం వంటివి చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన సీనియర్ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు కూడా జగన్ ని కలిసి తమ మద్దతు తెలుపుతున్నారు.

ఇప్పటికే కొందరు నటులు బహిరంగంగా తమ మద్దతు తెలిపినా మరికొందరు మాత్రం ఎన్నికల సమయానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు ఉంటామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. రచయిత, నటుడు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలుసుకుని తమ మద్దతు ఎప్పుడో తెలిపారు. పలువురు నటులు, దర్శకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తారని పోసాని కృష్ణమురళి ప్రకటించారు.

అక్కినేని నాగార్జున కూడా ఇటీవల జగన్ ను కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ మామ, పారిశ్రామికవేత్త, స్టూడియో ఎన్ మాజీ అధిపతి నార్నే కూడా జగన్ ను కలిశారు.

సినీ పరిశ్రమకు చెందిన వారందరూ జగన్ ను కలవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. సినీ పరిశ్రమకు ఇన్నాళ్లు తానే అండగా ఉన్నానని,  అలాంటిది ఇప్పుడు పరిశ్రమకు చెందిన వారు జగన్ ను కలవడంలో అర్ధమేమిటని సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్రరావు, నిర్మాత డి.సురేష్ బాబు, నటుడు కృష్ణ…. వంటి వారిని చంద్రబాబు ప్రశ్నించినట్లు చెబుతున్నారు.

సినీ హీరోలు ఎన్నికల్లో తమ తరపున ప్రచారం చేయక పోయినా ఫరవాలేదని, కాని జగన్ ను కలవడం మాత్రం మానుకోవాలని అన్నట్టు సమాచారం. “ సినీ పరిశ్రమ మొత్తం మన సామాజిక వర్గం వారే ఉన్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన కొందరు ఎమ్మెల్యేలు మన సామాజిక వర్గం వారినే టార్గెట్ చేశారు. అలాంటప్పుడు మన వాళ్ళంతా వాళ్ళని ఎలా కలుస్తారు ” అని చంద్రబాబు అన్నట్టు సమాచారం.

తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయకపోయినా పర్వాలేదు గానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కలవడానికి మాత్రం నిరోధించాలని, ఇందుకోసం సినీ కళాకారుల సంఘం ‘మా’ ను సైతం ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

సినీ పరిశ్రమకు చెందిన వారు వ్యక్తిగతంగా ఎవరిని కలుస్తారో తమకు తెలియదని, వారిని ఎలా నియంత్రించగలమని అన్నట్లు సమాచారం. మీరు మీ ప్రయత్నాలు చేయండి, మిగిలింది నేను చూసుకుంటాను అని  చంద్రబాబు నాయుడు సినీ పెద్దలకు చెప్పినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.