ప్రేమ జంటపై దాడి కేసులో దిగ్బ్రాంతికర అంశాలు

పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని జీలకర్రగూడెం బౌద్ద ఆరామాల వద్ద ప్రేమ జంటపై దాడి కేసు ఒక కొలిక్కి వచ్చింది. ఇటీవల ఏకాంతంగా గడుపుతున్న ప్రేమ జంటపై దాడి జరిగింది. అమ్మాయిపై అత్యాచారం చేసి ఆపై చంపేశారు. ప్రియుడిని తీవ్రంగా గాయపరిచారు.

ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు… కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లికి చెందిన రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో రాజు పలు దిగ్బ్రాంతికర విషయాలు చెప్పాడు.

బౌద్దారామ కొండపైకి వచ్చే ప్రేమ జంటలను రాజు గతంలోనూ టార్గెట్ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఏకాంతంగా ఉన్న ప్రేమజంటలను గుర్తించి వారిని బ్లాక్‌మెయిల్ చేసి వారి నుంచి నగదు, నగలు దోచుకునే వాడు. ఇప్పుడు కూడా రాజు… శ్రీధరణి, నవీన్‌పై దాడి చేసినట్టు ఒప్పుకున్నాడు.

నవీన్‌ను కొట్టి శ్రీధరణిపై అత్యాచారం చేసి ఆమెను చంపేసినట్టు రాజు వెల్లడించాడు. నవీన్, శ్రీధరణి కూర్చుని మాట్లాడుతున్న సమయంలో ఇద్దరి తలలపై కర్రలతో రాజు మోదాడు. శ్రీధరణి తల వెనుక మూడు చోట్ల బలమైన గాయాలు అవడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది.

నవీన్‌ తలకు ఐదు చోట్ల దెబ్బలు తగిలాయి. గతంలోనూ రాజు పలు ప్రేమ జంటలపై దాడి చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రేమజంటపై దాడి వెనుక మరికొందరి హస్తం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.