మహానాయకుడు కోసం చందాలు

మీరు సరిగ్గానే చదివారు. ఎన్టీఆర్-మహానాయకుడు సినిమా కోసం తెలుగు తమ్ముళ్లు చందాలు వేసుకుంటున్నారు. అలా పోగైన మొత్తంతో సినిమాను ఆడిస్తున్నారు. ఇదేదో ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం కాదు, చంద్రబాబు అంటే భయం. అవును.. ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాను ఆడించాల్సిందిగా జిల్లాల వారీగా తెలుగు తమ్ముళ్లకు ఆదేశాలు వెళ్లిపోయాయి.

ప్రతి సెంటర్ లో మహానాయకుడు సినిమాను ఆడించే బాధ్యతను తెలుగు తమ్ముళ్లు తీసుకోవాలని, థియేటర్లలో కనీసం 50శాతం ఆక్యుపెన్సీ ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు, మహానాయకుడు ప్రదర్శిస్తున్న థియేటర్లలో నిఘా కూడా ఉంచామని, 50శాతానికి తక్కువగా ఆక్యుపెన్సీ కనిపిస్తే ఆ జిల్లా కార్యకర్తలు, నేతలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

అసలే ఎన్నికల సీజన్. ఏమాత్రం వ్యవహారం తేడాకొట్టినా మొదటికే మోసం వస్తుంది. అందుకే మండల స్థాయి నేతలంతా నోరు మూసుకొని, సొంత ఖర్చుతో మహానాయకుడు సినిమాను ఆడిస్తున్నారు. ఒకరోజు ఉపాధ్యాయులకు, మరో రోజు పోలీసులకు, ఇంకో రోజు విద్యార్థులకు.. ఇలా రోజుకో వర్గానికి టిక్కెట్లు ఇస్తున్నారు. నెల్లూరు లాంటి ప్రాంతాల్లో మిగిలిపోయిన టిక్కెట్లను దగ్గర్లోని పాన్ షాపుల్లో ఇచ్చి పంచి పెట్టమని కోరుతున్నారంటే.. మహానాయకుడు దీనస్థితిని అర్థంచేసుకోవచ్చు.