Telugu Global
NEWS

తెలంగాణలో మహాకూటమి విచ్ఛిన్నం.... లోక్‌సభకు ఒంటరి పోరు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడ్డాయి. కేసీఆర్ ప్రభంజనాన్ని తట్టుకోలేక మహాకూటమి ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. ఇక త్వరలో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. పార్టీలోని నేతలు, కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నట్లు అధిష్టానానికి నివేదిక సమర్పించారు. ఇటీవల రాహుల్ గాంధీతో ఢిల్లీలో జరిగిన […]

తెలంగాణలో మహాకూటమి విచ్ఛిన్నం.... లోక్‌సభకు ఒంటరి పోరు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడ్డాయి. కేసీఆర్ ప్రభంజనాన్ని తట్టుకోలేక మహాకూటమి ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. ఇక త్వరలో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. పార్టీలోని నేతలు, కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నట్లు అధిష్టానానికి నివేదిక సమర్పించారు. ఇటీవల రాహుల్ గాంధీతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పినట్లు తెలుస్తోంది. సీనియర్ల వాదన విన్న రాహుల్ కూడా వారి నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

మరోవైపు కాంగ్రెస్ నిర్ణయం తెలుసుకున్న టీటీడీపీ బుధవారం రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తుండటంతో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. తెలంగాణలో పార్టీకి బలమున్న స్థానాల్లో పోటీ చేయాలని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలియజేయాలని నిర్ణయించారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన తెలంగాణ జన సమితి లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టింది. మహాకూటమికి చైర్మన్‌గా కోదండరాంను నియమించినా… ఆయన మాటకు విలువ లేకుండా చేశారనే కోపంతో టీజేఎస్ ఉంది. కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని టీజేఎస్ భావిస్తోంది.

ఇక మహాకూటమికి తెరలేపిన సీపీఐ మాత్రం కాంగ్రెస్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో మహాకూటమికి సన్నాహాలు చేస్తూ తెలంగాణలో మాత్రం ఒంటరి పోరుకు ఎందుకు సిద్దమవుతున్నారని సీపీఐ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం అధికారికంగా వెలువడిన తర్వాత ఎన్నికల్లో పోటీపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

First Published:  27 Feb 2019 9:48 PM GMT
Next Story