చంద్రబాబు బహిరంగ లేఖకు కోట్లు ఖర్చు

చంద్రబాబు ఏం చేసినా కోట్లు ఖర్చైపోతున్నాయి. గతంలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని విమర్శించేందుకు బహిరంగ లేఖలు విడుదల చేసిన చంద్రబాబు… ఇప్పుడు మోడీని విమర్శించేందుకు బహిరంగ లేఖ రాశారు. బహిరంగ లేఖ రాస్తే
ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ చంద్రబాబు బహిరంగ లేఖ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మింగేసింది.

ప్రధాని ఏపీకి వస్తున్న సందర్బంగా ఆయన్ను నిలదీస్తూ చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ లేఖ విడుదల చేశారు. పలు అంశాలను అందులో ప్రస్తావించారు. అయితే సాధారణంగా బహిరంగ లేఖలు రాస్తే వాటిని పత్రికలు వార్తగా ప్రచురిస్తాయి.

కానీ చంద్రబాబు బహిరంగ లేఖను మాత్రం అన్ని తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో ప్రకటనగా ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి పత్రికలోనూ మొదటి పేజీలో సగభాగంలో భారీగా ఈ లేఖను ముద్రించారు. ఈ లేఖను పత్రికల్లో ప్రచురించేందుకు నేరుగా ఆంధ్రప్రదేశ్‌ సమాచార శాఖే అధికారికంగా జారీ చేయడం విశేషం. ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ఈ లేఖను ప్రకటన రూపంలో ఇచ్చినందున కోట్లాది రూపాయలు ఈ లేఖకు ఖర్చు అయింది.