యడ్యూరప్పా… శవాల మీద ఓట్లు తప్పప్పా!

“నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదు. హఠాత్తుగా ఉగ్రవాదుల మీద దాడి చేస్తున్నారు. ఇది కచ్చితంగా ఎన్నికల కోసమే” – పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

“ఉగ్రవాదుల దాడిని, చివరికి సైనికులను కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల్లో విజయం కోసం ఉపయోగించుకుంటున్నారు ఇది దారుణం” కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.

“సైనికదాడితో కర్ణాటకలో 22 స్థానాలలో బిజెపి తప్పక విజయం సాధిస్తుంది” కర్ణాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప.

పుల్వామాలో సైనికుల కాన్వాయ్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 49 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి అనంతరం…. ఎన్నికలు మరో మూడు నెలలు ఉండగా ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి జరగడం అనుమానాస్పదంగా ఉందంటూ ప్రతిపక్షాలు అధికార భారతీయ జనతా పార్టీ పై అనుమానం వ్యక్తం చేశా‍యి. ఆ దాడి అనంతరం భారత సైనికులు పాకిస్తాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాద మూకలపై దాడులు చేసి వారిని మట్టికరిపించారు. ఈ చర్యపై దేశం యావత్తు హర్షాన్ని వ్యక్తం చేసింది. అయితే మరో వైపు ఉగ్రవాదుల దాడి, అనంతర పరిణామాలపై ప్రతిపక్షాలు అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈ అనుమానాలను నిజం చేస్తూ భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.

పుల్వామాలో భారత వైమానిక దాడుల అనంతరం రానున్న లోక్ సభ ఎన్నికలలో కర్ణాటకలో ఇరవై రెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తీవ్ర అభ్యంతరకరమని, దాడిలో మరణించిన సైనికుల చితిపై ఓట్లు దండుకోవడమే అంటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

యడ్యూరప్ప వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ అసలు రూపం బయటపడిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రంలో అధికార పక్షమైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా యడ్యూరప్ప వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు.

ఒకవైపు దేశమంతా విచారం, ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ తో ఉంటే యడ్యూరప్ప మాత్రం ఎన్నికల్లో తాము గెలుస్తామని ప్రకటించడం భారతీయ జనతా పార్టీ అనైతిక విధానాలకు నిదర్శనమని అంటున్నారు. దేశభక్తులు తామే అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలతో దేశ ద్రోహులుగా మిగిలిపోతారని, తమ సీనియర్ నాయకుడు చేసిన ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోడీ సిగ్గుపడాలని తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.

భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా “ యడ్యూరప్ప… ఇదేంది అప్పా” అంటూ మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఎలాంటి పనైనా చేస్తారని అనడానికి యడ్యూరప్ప వ్యాఖ్యలే నిదర్శనమని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.