ఎఫ్16 వాడిన పాక్…. ఆందోళనలో ట్రంప్ సర్కార్

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒకరి విమానాలను ఒకరు వెంబడించి మరీ కూల్చేసుకున్నారు. భారత్ మిగ్-21 బైసన్‌ను కోల్పోగా.. పాకిస్తాన్ ఎఫ్-16 విమానాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఇదే అమెరికాను ఆందోళనకి గురిచేస్తోంది. పాక్ విమానం కోల్పోతే అమెరికాకు ఆందోళన ఎందుకు అని మీకు అనుమానంగా ఉందా..? ఇప్పుడు అసలు కథ చెప్పుకుందాం.

ప్రపంచంలో పలు దేశాలకు రక్షణ రంగ ఉత్పత్తులను అమ్మే సంస్థలు కొన్నే ఉన్నాయి. వాటిలో మిగ్, డసో, బోయింగ్, లాక్ హీడ్ మార్టిన్ సంస్థలు ప్రధానమైనవి. పలు దేశాలకు యుద్ధ విమానాలను తయారు చేసి అమ్ముతుంటాయి. అయితే ప్రపంచంలో అతి పెద్ద సరఫరాదారు మాత్రం అమెరికాకు చెందిన లాక్‌ హీడ్ మార్టిన్ అనే సంస్థ. ఈ సంస్థకు అమెరికాలో అతిపెద్ద లాబీయింగ్ వ్యవస్థ ఉంది. ఆ దేశాధినేతను కూడా లొంగదీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను కట్టబెట్టేలా ఒప్పించడం ఆ లాబీయింగ్ ప్రథమ కర్తవ్యం.

ఈ లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన అత్యాధునికమైన విమానమే ఎఫ్-16. పాకిస్తాన్‌కు పెద్దన్నలా వ్యవహరిస్తూ.. వాళ్ల ఆర్మీకి ఆర్థికంగానే కాక పలు విషయాల్లో అమెరికా సహకారం అందిస్తోందన్న విషయం బహిరంగ రహస్యమే. అలా పాకిస్తాన్‌కు ఎఫ్-16 విమానాలను అమ్మింది. కేవలం ఉగ్రవాదులపై యుద్ధానికి మాత్రమే వాడాలని.. ఇతర దేశాలపై యుద్ధానికి ఎఫ్-16ని ఉపయోగించ వద్దనే షరతు కూడా విధించినట్లు సమాచారం.

కాగా, అభినందన్ తన మిగ్ 21లో…. పాక్ ఎఫ్-16ని వెంటాడి కూల్చేశాడు. ఇదే ఇప్పుడు అమెరికా ఆందోళనకు కారణమైంది. చాలా పాత తరానికి చెందిన మిగ్ దాడిలో అత్యాధునిక ఎఫ్-16 కూలిపోయిందనే విషయం లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ జీర్ణించుకోలేక పోతుంది. ఈ విషయం బయటపడితే ప్రపంచవ్యాప్తంగా తను కుదుర్చుకున్న 1.4 లక్షల కోట్ల రూపాయల వ్యాపార ఒప్పందాలు రద్దవుతాయనే ఆందోళనలో ఉంది. భారత్‌తో కూడా ఒప్పందం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న లాక్ హీడ్ మార్టన్‌కు ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.

అమెరికా తమ వ్యాపార సంస్థలకు నష్టం వస్తుందంటే ఎలాంటి సాహసానికైనా దిగుతుంది. తమ దేశ వ్యాపార ప్రయోజనాలే ఆ దేశాధినేతకు ముఖ్యం. దీనికి తోడు పాక్ సెన్సార్ బోర్డు అధ్యక్షుడు డానియల్ గిలానీ ఒక ట్వీట్ చేశారు. తమ ఎఫ్16ని కూల్చామంటున్న భారత్‌పై లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ కేసు వేయబోతోందని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇది మరింత ఆజ్యం పోసింది. మరోవైపు లాక్‌హీడ్ మార్టిన్ తాము భారత్‌పై ఎలాంటి కేసు వేయబోవడం లేదని స్పష్టం చేసింది. కాగా, పాక్ ఎఫ్ 16 వాడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు.