దక్షిణాదిలో జాతీయ పార్టీలు అవుట్ !

దక్షిణాది. దేశ రాజకీయాలలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రాంతం. కేరళలో వామపక్షాల రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. మిగిలిన రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలో ప్రాంతీయ పార్టీల హవా నానాటికీ పెరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. ఆయన మరణానంతరం జరిగిన పరిణామాలతో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.

రాష్ట్రాన్ని విడగొట్టారన్న కోపంతో…. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రత్యేక రాష్ట్రం తామే ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి కే పట్టం కట్టారు.

ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికల్లో కూడా పార్టీ బొక్క బోర్లా పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే రానున్న రెండు దశాబ్దాలలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు.

తమిళనాడులో గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఒక దఫా అన్నాడీఎంకే అధికారంలో ఉంటే మరో దఫా డీఎంకే అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం తమిళనాడులో పూర్తి స్థాయిలో పతనం అయింది. ఇక్కడ తమ ప్రాభవాన్ని పెంచుకునేందుకు డీఎంకేతో కలుస్తున్నా పెద్ద ఉపయోగం లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

ఒక కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రాంతీయ పార్టీ జెడిఎస్ తో కలిసి అధికారాన్ని పంచుకుంది. ఈ పాలన కూడా  ఎంత కాలం ఊడుతుందో కూడా తెలియదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

భారతీయ జనతా పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉంది. కర్ణాటకలో మాత్రమే ఆ పార్టీకి  అంతో ఇంతో బలం ఉంది. తమిళనాడులో బీజేపీ తన ఎదుగుదల కోసం స్థానిక ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకేతో చేతులు కలిపింది. ఇది ఎంతవరకు మంచి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో బిజెపికి అంతో ఇంతో బలం ఉన్నా…. నాయకుల్లో ఉన్న అనైక్యత కారణంగా గత శాసనసభ ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయింది.

రాష్ట్రాన్ని విడదీశారు అన్న కోపం కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంటే…. ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కోపం భారతీయ జనతా పార్టీపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్రంగా ఉంది.

దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోనూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు నిలదొక్కుకునే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.