కొణతాల టీడీపీకి జై కొట్టడంతో.. పాత గూటికి చేరనున్న దాడి

ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ నాయకులు తమ భవిష్యత్ ప్రణాళికలకు పదును పెడుతున్నారు. గత నాలుగేళ్లుగా సైలెంట్‌గా ఉన్న ముఖ్య నేతలు కూడా తమకు అనుకూలమైన పార్టీలలో చేరడానికి మార్గం సిద్దం చేసుకుంటున్నారు.

తాజాగా విశాఖ జిల్లాలో ఇద్దరి నాయకుల నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. జిల్లాలో కొణతాల రామృష్ణ, దాడి వీరభద్రరావుల మధ్య గత కొన్నేళ్లుగా రాజకీయ వైరం నెలకొంది. అయినా వీటిని పక్కన పెట్టి వీరు గతంలో వైసీపీలో ఒకే సమయంలో కొనసాగారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అధికారం సాధించడంలో విఫలం కావడంతో రాజకీయంగా వీరిద్దరూ సైలెంట్ అయ్యారు.

తాజాగా తిరిగి వీళ్లు రాజకీయాల్లో క్రియాశీలంగా మారడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధినేత చంద్రబాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అందింది.

కొణతాల టీడీపీలో చేరడం ఖాయం కావడంతో దాడి వీరభద్రరావు తిరిగి వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. గతంలో దాడి ఇంటికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్లారు. అప్పుడు దాడి జనసేనలో చేరడం ఖాయమనే చర్చ జరిగింది. కాని దాడి ఇప్పుడు అనూహ్యంగా పాత పార్టీలోకే వెళ్లాలని నిశ్చయించుకున్నారు.

ఈ నెల 9న దాడి వీరభద్రరావు, తన కుమారుడు రత్నాకర్‌తో కలసి వైసీపీలో చేరనున్నారు. రెండు రాజకీయ కుటుంబాలు తిరిగి వేర్వేరు పార్టీల్లో క్రియాశీలంగా మారుతుండటంతో విశాఖ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.