ధోనీ హోంగ్రౌండ్ లో రేపే వన్డే హంగామా

  • రాంచీ వేదికగా ఆఖరి వన్డేకు ధోనీ సిద్ధం
  • హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ కు టీమిండియా గురి
  • టీమిండియాకు చెలగాటం, ఆసీస్ కు సిరీస్ సంకటం

టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల పాంచ్ పటాకా వన్డే సిరీస్ షో…హైదరాబాద్, నాగపూర్ నగరాల మీదుగా రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియానికి చేరింది.

మహేంద్రసింగ్ ధోనీ హోంగ్రౌండ్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం జార్ఖండ్ అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.  ఈ డే-నైట్ సమరం ఆతిథ్య టీమిండియాకు చెలగాటం…ఆస్ట్రేలియాకు సిరీస్ సంకటంగా మారింది.

టీమిండియా జోరు… కంగారూ బేజారు…

వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా హాట్ ఫేవరెట్ జట్లు టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న పాంచ్ పటాకా సిరీస్ .. హాట్ హాట్ గా మారింది. హైదరాబాద్ వేదికగా ముగిసిన మొదటి వన్డేలో 6 వికెట్ల విజయం సాధించిన విరాట్ సేన…నాగపూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సైతం 8 పరుగుల విజయంతో… సిరీస్ లో 2-0 ఆధిక్యంతో పైచేయి సాధించింది.

మరోవైపు… వరుస పరాజయాలతో కంగుతిన్న కంగారూ టీమ్ కు మాత్రం…రాంచీ లోని జార్కండ్ క్రికెట్ సంఘం ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే మూడో వన్డే..డూ ఆర్ డై గా మారింది. సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలంటే ఆరునూరైనా మూడో వన్డే నెగ్గితీరాల్సి ఉంది.

సొంతగడ్డపై ధోనీ ఆఖరాట…

మూడేళ్ల విరామం తర్వాత…రాంచీ వేదికగా జరుగుతున్న ఈ వన్డే మ్యాచ్ కోసం…జార్ఖండ్ అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జార్ఖండ్ డైనమైట్.. మహేంద్ర సింగ్ ధోనీ..తన హోంగ్రౌండ్ వేదికగా ఆఖరి వన్డే ఆడటానికి సిద్ధంకావడంతో… స్టేడియం కిటకిటలాడటం ఖాయంగా కనిపిస్తోంది.

హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలివన్డేలో 6 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా…నాగపూర్ వన్డేలో మాత్రం కంగారూల నుంచి గట్టి పోటీ ఎదుర్కొని 8 పరుగుల గెలుపుతో.. విజయాన్ని సొంతం చేసుకోడమే కాదు…2-0తో పైచేయి సైతం సాధించగలిగింది.

ఆసీస్ కష్టాలు….

మరోవైపు…వరుస పరాజయాలతో కంగుతిన్న ఆస్ట్రేలియాకు పదునైన బౌలింగ్ ఉన్నా…బ్యాటింగ్ లో నిలకడలేమితో ఉక్కిరిబిక్కిరవుతోంది.

ఆరోన్ ఫించ్, మాక్స్ వెల్ , హ్యాండ్స్ కోంబ్, షాన్ మార్ష్ లాంటి సూపర్ హిట్టర్లు ఉన్నా…టీమిండియా స్పిన్ ఎటాక్ ను దీటుగా ఎదుర్కొనలేకపోడం… ఆస్ట్రేలియా టాపార్డర్ ప్రధాన బలహీనతగా కనిపిస్తోంది.

టాపార్డర్ లోపాలను సవరించుకొని…రాంచీ వన్డేను నెగ్గడం ద్వారా సిరీస్ అవకాశాలను నిలబెట్టుకోవాలన్న పట్టుదల కంగారూటీమ్ లో కనిపిస్తోంది.

భారత టాపార్డర్లో రాహుల్…

ఇక…టీమిండియా మాత్రం…తుదిజట్టు కూర్పులో ఒకటి లేదా రెండుమార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్ శిఖర్ ధావన్ లేదా అంబటి రాయుడుల స్థానంలో…యువఆటగాడు రాహుల్.. తుదిజట్టులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

కెప్టెన్ విరాట్ కొహ్లీ తన కెరియర్ లో 40వ వన్డే శతకంతో సూపర్ ఫామ్ లో ఉంటే…విజయ్ శంకర్ ఆల్ రౌండ్ ప్రతిభ… టీమిండియాకు అదనపు బలంగా మారింది.

4 వన్డేల్లో టీమిండియా 2 విజయాలు…

జార్ఖండ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా… గత ఆరేళ్ల కాలంలో నాలుగు వన్డేలు ఆడిన టీమిండియా 2 విజయాలు, ఓ పరాజయం రికార్డుతో ఉంది.

రాంచీ వేదికగా గతంలో కంగారూటీమ్ ఆడిన ఒకే ఒక్క వన్డే మాత్రం ఫలితం తేలకుండానే ముగిసింది. బ్యాటింగ్ తో పాటు… బౌలర్లకూ సమానంగా అనుకూలించే ఇక్కడి వికెట్ పై 280కి పైగా పరుగులు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి.

ప్రస్తుత సిరీస్ లో…వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు…కంగారూటీమ్…కనీసం మూడో వన్డేలో అయినా నెగ్గటం ద్వారా బ్రేక్ వేసి… సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలుగుతుందా? లేదా? అన్నదే ఇక్కడి అసలు పాయింట్.