షా వ‌చ్చారు…. చిచ్చు పెట్టి వెళ్లారు

భార‌తీయ జ‌నాతా పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా ఒక రోజు తెలంగాణ పర్యాట‌నకు వ‌చ్చారు. నిజామాబాద్ లో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, జిల్లాలో క్ల‌స్ట‌ర్లతో స‌మావేశం నిర్వ‌హించారు. తిరుగు ప్ర‌యాణంలో హైదరాబాదులో తెలంగాణ‌లోని బిజేపీ అగ్ర‌నాయ‌కుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసారు.

రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో వ్యూహ‌ర‌చ‌న‌ను రూపొందించారు. తెలంగాణ‌లోని 17 లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్దులుగా ఎవ‌రు పోటీ చేస్తారో కూడా చెప్ప‌కుండానే వెనుతిరిగారు. నిజామాబాద్ లో జ‌రిగిన స‌మావేశానికి, హైద‌రాబాద్ లో జ‌రిగిన భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల స‌మావేశం మ‌ధ్య అమిత్ షా ఓ కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించార‌ట‌.

ఆ స‌మావేశంలో పార్టీకి చెందిన నాయ‌కులు ఎవ్వ‌రూ పాల్గొన లేద‌ని స‌మాచారం. అత్యంత ప‌గ‌డ్బందిగా జ‌రిగిన స‌మావేశంలో తెలంగాణ‌కు చెందిన బ‌డా పారిశ్రామిక వేత్త‌లు, వ్యాపార వేత్త‌లు పాల్గొన్నార‌ని విశ్వ‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ రహ‌స్య స‌మావేశామే తెలంగాణ బిజేపీలో చిచ్చు ర‌గిల్చింద‌ని అంటున్నారు.

రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుల‌కు కాకుండ, ఇటీవ‌ల శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌లో ఓట‌మి చెందిన అభ్య‌ర్దులకు కాకుండ కొంద‌రు పారిశ్రామిక వేత్త‌ల‌ను ఎన్నిక‌ల బ‌రిలో నిల‌పాల‌ని అమిత్ షా ప‌థ‌క ర‌చ‌న చేసార‌ని చెబుతున్నారు.

గ‌త శాస‌న స‌భ ఎన్నిక‌ల‌లో పోటీ చేసి ఓడిపోయిన సీనియ‌ర్ నాయ‌కులు కిష‌న్ రెడ్డి, ఎన్ వి.ఎస్.ఎస్.ప్ర‌భాక‌ర్, డా. కె ల‌క్ష్మ‌ణ్ వంటి వారు లోక్ స‌భ బ‌రిలో దిగాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వారిని కాద‌ని కొత్త‌వారిని ఎన్నిక‌ల బ‌రిలో దింపాల‌ని బిజేపీ అధిష్టానం నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యానికి తోడు అమిత్ షా ర‌హ‌స్యంగా నిర్వ‌హించిన బ‌డాబాబుల స‌మావేశం కూడా పార్టీలో చిచ్చు ర‌గిల్చింద‌ని అంటున్నారు.

ఎన్నిక‌ల‌లో ఓట‌మి స‌హ‌జ‌మ‌ని, శాస‌న‌స‌భ ఎన్నిక‌ల‌లో ఓడినంత మాత్రాన సీనియ‌ర్ నాయ‌కుల‌ను అవ‌మానించే దిశ‌గా పార్టీ అధిష్టానం వ్య‌వ‌హ‌రించ‌డం మంచిదికాద‌ని క‌మ‌ల‌నాథులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్నో సంవ‌త్స‌రాలుగా కిందిస్దాయి నుంచి ప‌నిచేసి వ‌చ్చిన త‌మ‌ను కూరలో క‌ర్వేపాకులా ప‌క్క‌న ప‌డ‌వేయ‌డం పార్టీకి మంచిది కాదంటున్నారు.