Telugu Global
Others

హద్దు మీరుతున్న విజయోత్సాహం

పుల్వామాలో జైష్-ఎ-మహమ్మద్ సి.ఆర్.పి. దళాల మీద దాడి చేసి 40 మందిని పొట్టన పెట్టుకోవడానికి ప్రతీకారంగ భారత వైమానిక దళం తీసుకున్న చర్యపై రెండు రకాల ప్రతిస్పందనలు వచ్చాయి. మొదటిది, జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులతో సహా అనేకమంది భారత సైనిక దళాలను అభినందించాయి. అధికార పక్షానికి సంబంధించినంతవరకు ప్రభుత్వ వర్గాలు, ప్రభుత్వాన్ని సమర్థించే ఇతరులు మిన్నంటే జయజయ ధ్వానాలు చేశారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీ తరఫు అధికార ప్రతినిధులు ఈ సైనిక చర్య పుల్వామా దాడికి […]

హద్దు మీరుతున్న విజయోత్సాహం
X

పుల్వామాలో జైష్-ఎ-మహమ్మద్ సి.ఆర్.పి. దళాల మీద దాడి చేసి 40 మందిని పొట్టన పెట్టుకోవడానికి ప్రతీకారంగ భారత వైమానిక దళం తీసుకున్న చర్యపై రెండు రకాల ప్రతిస్పందనలు వచ్చాయి. మొదటిది, జాతీయ ప్రతిపక్ష పార్టీల నాయకులతో సహా అనేకమంది భారత సైనిక దళాలను అభినందించాయి.

అధికార పక్షానికి సంబంధించినంతవరకు ప్రభుత్వ వర్గాలు, ప్రభుత్వాన్ని సమర్థించే ఇతరులు మిన్నంటే జయజయ ధ్వానాలు చేశారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీ తరఫు అధికార ప్రతినిధులు ఈ సైనిక చర్య పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవాలన్న జనాకంక్షకు అనుగుణంగా ఉందని ఊదరగొట్టారు. పాకిస్తాన్ మీద భారత వైమానిక దళం చేసిన దాడిని ప్రభుత్వ పక్షమూ ఇతర పక్షాలు ముక్త కంఠంతో సమర్థించాయన్న అభిప్రాయం వ్యక్తం అయింది. పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పారన్న ఆనందం వ్యక్తం అయింది. “మీ మనసులో ఏముందో నా మనసులో కూడా అదే ఉంది” అని ప్రధానమంత్రే అన్నారు. ఈ యుద్ధోన్మాద ధోరణి సమాజంలో, దేశాల మధ్య శాంతి, సామరస్యాలకు ఏ మేరకు తోడ్పడుతుందో ఆలోచించాలి.

ఈ సందర్భంలో రెండు ప్రశ్నలు తలెత్తుతాయి. మొదటిది జనాభిప్రాయం విదేశీ ముప్పు ఎదురైనప్పుడే ఇలా ఉంటుందా లేక అంతర్గతంగా తోటి పౌరులు ఇదే వైఖరి అనుసరిస్తారా? రెండవది ప్రజల్లో ఇలాంటి భావాలున్నప్పుడు వాటిని అదుపు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉండదా?

పుల్వామా దాడి తరవాత ప్రజలే సైనిక వ్యూహకర్తల లాగా ఆలోచించి యుద్ధం, దాడి, ధైర్యం, నిర్భయం వంటి మాటలు మాట్లాడారు. తేడా ఏమిటంతే ఇలా ఆలోచించినవారు సైనిక దుస్తులు వెసుకోలేదు, చేతిలో ఆయుధాలు లేవు. కానీ వారి చేతిలో కశ్మీరీలలో భయం గొల్పడానికి ఇతర ఆయుధాలున్నాయి. తీవ్రవాదులు కశ్మీర్ లోనే ఉంటారు అనుకుని కశ్మీరీల మీద ద్వేషం రెచ్చగొడ్తున్నారు. వారిని సమాజం నుంచి బహిష్కరించాలి అన్న దాకా వెళ్లారు.

బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి కశ్మీరీలను సమాజం నుంచి వెలివేయాలి అనడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కాని దేశ ప్రజలందరూ శాంతి సామరస్యాలతో ఉండేట్టు చూడవలసిన బాధ్యత ఇలాంటి వ్యక్తులదే. ఇలా కొన్ని సామాజిక వర్గాలను వెలివేస్తే తర్వాత హింస కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాదనలు సైన్యానికి పౌరులకు మధ్య విభజన రేఖను చెరిపివేస్తాయి.

సైనికీకరణ వల్ల పౌర సమాజం దౌర్జన్యానికి మార్గం సుగమం చేస్తుంది. లేదా దౌర్జన్యకరమైన భాష వాడుతుంది. అహింసాయుత విధానాన్ని, ప్రజాస్వామ్య సూత్రాలను, సహన శీలతను, ఇతరుల విషయంలో హేతుబద్ధంగా వ్యవహరించడం పౌర సమాజం చేయవలసిన పని. విదేశీ శక్తులను ఎదుర్కునే విషయంలో భద్రతా దళాల ఆలోచనా ధోరణి భిన్నంగా ఉంటుంది. దానికి తగిన వ్యూహాలు ఆ దళాలు రూపొందించుకుంటాయి.

పౌరులు భద్రతా దళాల బాధ్యత తీసుకోకూడదు. కానీ పౌరులే తమ హద్దులు దాటి యుద్ధం చేయాలని భద్రతా దళాలకు సూచించే స్థాయికి వెళ్తున్నారు. యుద్ధం ఒక్కటే పరిష్కారం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. అంతటితో ఆగకుండా తమ జాతీయతా ఆగ్రహాన్ని సమాజంలోని తోటి పౌరుల మీదకు మళ్లిస్తున్నారు.

మితిమీరిన విజయోత్సాహం చివరకు విషాదానికే దారి తీస్తుంది. శాంతిని కాంక్షించే ప్రజాస్వామ్య దేశంలో విజయోత్సాహానికి ఓ పరిమితి ఉంటుంది. ప్రజాస్వామ్య దేశంలో అధికారంలో ఉన్న వారు ప్రజలలో ఇలాంటి విపరీత ధోరణులు ప్రబలకుండా జాగ్రత్త పడాలి. ప్రజలలో ప్రతీకారేచ్ఛ పెరిగే ధోరణిని అనుసరించకుండా తోటి పౌరుల్లో ఈ విపరీత భావాలు పాతుకు పోకుండా చూడవలసిన బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానిదే.

కయ్యానికి కాలు దువ్వే జాతీయతావాదం “జాతి అవమానానికి” దారి తీస్తుంది. ఇది ప్రతీకారానికి, ఎదురుదాడికి మార్గం సుగమం చేస్తుంది. జగడం పెట్టుకునే రీతిలో వ్యవహరిస్తే సరిహద్దులో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. అందువల్ల సరిహద్దుకు రెండు వేపులా ప్రతీకారేచ్ఛ రగులుతూ ఉంటుంది. ఈ జగడాల మారి ధోరణికి అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత భారత్ లోనూ, పాకిస్తాన్ లోనూ అధికారంలో ఉన్న వారి మీద ఉంది. ఈ ధోరణి తలెత్తినప్పుడల్లా అదుపు చేయాలి. సైనికీకరణ ధోరణి ప్రబలినప్పుడల్లా మానవతా విలువలు మాయమైనాయని యుద్ధాల చరిత్ర గుణపాఠం నేర్పుతోంది.

(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)

First Published:  7 March 2019 8:38 PM GMT
Next Story