పుల్వామా అమరులకు టీమిండియా అపూర్వ శ్రద్ధాంజలి

  • ఆర్మీక్యాప్ లతో ఆసీస్ తో రాంచీ వన్డేలో విరాట్ అండ్ కో
  • టీమిండియా క్యాప్ ల స్థానంలో సైనికదళాల టోపీలు
  • భారతజట్టు సభ్యులకు ఆర్మీ క్యాప్ లు అందచేసిన ధోనీ

పుల్వామా అమరవీరులకు…టీమిండియా క్రికెటర్లు అరుదైన రీతిలో శ్రద్ధాంజలి ఘటించారు.  ఆసీస్ తో పాంచ్ పటాకా సిరీస్ లో భాగంగా రాంచీ స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే ప్రారంభానికి ముందు… ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు.

భారత సైనికదళాలకు సంఘీభావంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో…జట్టు సహచరులకు, క్రికెట్ వ్యాఖ్యాతలకు..మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేకంగా తయారు చేసిన సైనికదళాల టోపీలను అందచేశాడు.

కెప్టెన్ విరాట్ కొహ్లీతో సహా జట్టులోని సభ్యులందరూ ఈ క్యాప్ లు ధరించి మ్యాచ్ లో పాల్గొన్నారు. భారత క్రికెట్ జట్టు దుస్తుల అధికారిక స్పాన్సర్ నైకీతో కలసి.. ధోనీ-కొహ్లీ ఈ క్యాప్ లకు తుదిరూపం ఇచ్చారు.

టీమిండియా టోపీల స్థానంలో సైనిక దళాల క్యాప్ లు ధరించి విరాట్ సేన బరిలోకి దిగింది. అంతేకాదు..ఇక నుంచి…భారత్ వేదికగా జరిగే అంతర్జాతీయ సిరీస్ ల్లో కనీసం ఒక్కమ్యాచ్ లోనైనా ఆర్మీక్యాప్ లు ధరించి క్రికెట్ మ్యాచ్  ఆడాలన్న నిబంధనను ప్రవేశపెట్టారు.

 భారత సైనిక ప్రాదేశిక దళాలలో లెఫ్ట్ నెంట్ కల్నల్ గౌరవ హోదాతో ఉన్న జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ హోంగ్రౌండ్ నుంచే ఈ వినూత్న ఆలోచన కార్యరూపం దాల్చడం విశేషం.

రాంచీ వన్డే మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని భారత సైనికదళాల సంక్షేమనిధికి జమచేయాలని నిర్ణయించినట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రకటించాడు.