ఢిల్లీ డైనమైట్ రిషభ్ పంత్ కు బీసీసీఐ బొనాంజా

  • రిషభ్ పంత్ కు 5 కోట్ల రూపాయల గ్రేడ్-ఏ కాంట్రాక్టు
  • అంబటి రాయుడు, విహారిలకు కోటి రూపాయల కాంట్రాక్టు
  • 10 లక్షల గ్రేడ్-సీ కాంట్రాక్టు జాబితాలో అరుంధతి రెడ్డి

టీమిండియా స్టార్ ప్లేయర్ల వార్షిక కాంట్రాక్టుల్లో బీసీసీఐ మార్పులు చేర్పులు చేసింది. ఢిల్లీ యువఆటగాడు రిషభ్ పంత్ రొట్టెవిరిగి నేతిలో పడింది. ఏకంగా 5 కోట్ల రూపాయల గ్రేడ్-ఏ కాంట్రాక్టు సాధించాడు.

తెలుగు తేజాలు హనుమ విహారి, అంబటి రాయుడు ఏడాదికి కోటి రూపాయల గ్రేడ్-సీ కాంట్రాక్టుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళా క్రికెటర్లకు సైతం బీసీసీఐ కాంట్రాక్టులను ప్రకటించింది.

డబ్బే డబ్బు….

టీమిండియా ప్రధాన ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను బీసీసీఐ సవరించింది. 2018 అక్టోబర్ 1 నుంచి 2019 సెప్టెంబర్ 30 వరకూ అమలులో ఉండే కాంట్రాక్టు వివరాలను బీసీసీఐ ప్రకటించింది.

బీసీసీఐ తాజా సెంట్రల్ కాంట్రాక్టు ప్రకారం…ఢిల్లీ యువఆటగాడు రిషభ్ పంత్….ఏకంగా గ్రేడ్-ఏ కాంట్రాక్టు సంపాదించాడు. ఈ యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్…. ఏడాదికి 5 కోట్ల రూపాయల మొత్తం కాంట్రాక్టు ఫీజుగా అందుకోనున్నాడు.

ధావన్, భువీ డౌన్

ఢిల్లీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్, యూపీ ఓపెనింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 7 కోట్ల రూపాయల గ్రేడ్-ఏ ప్లస్ కాంట్రాక్టు నుంచి 5 కోట్ల రూపాయల గ్రేడ్-ఏ కాంట్రాక్టుకు పడిపోయారు.

తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు అంబటి రాయుడు, హనుమ విహారి మాత్రం…. కోటి రూపాయల గ్రేడ్-సీ కాంట్రాక్టుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంబటి రాయుడు వన్డే ఫార్మాట్ కు, హనుమ విహారి టెస్ట్ ఫార్మాట్ కు…. పరిమితం కావడంతో…. గ్రేడ్-సీ క్రికెటర్లుగా మిగిలిపోయారు.

ఆల్- ఇన్-వన్ కాంట్రాక్టు 7 కోట్లు

మొత్తం..మూడు ఫార్మాట్లలోనూ ప్రధాన ఆటగాళ్ళుగా ఉన్న కెప్టెన్ విరాట్ కొహ్లీ, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా మాత్రమే…ఏడాదికి ఏడు కోట్ల రూపాయల… గ్రేడ్-ఏ ప్లస్ కాటగిరీలో చోటు సంపాదించారు.

గ్రేడ్-ఏ క్రికెటర్లకు ఏడాదికి 5 కోట్లు, గ్రేడ్-బీ ఆటగాళ్లకు ఏడాదికి 3 కోట్ల రూపాయలు, గ్రేడ్-సీ క్రికెటర్లకు కోటి రూపాయలు చొప్పున బీసీసీఐ చెల్లిస్తూ వస్తోంది. ఈ మొత్తంతో పాటు ఆడిన మ్యాచ్ లను బట్టి… మ్యాచ్ ఫీజులు , లోగో, స్పాన్సర్ షిప్ మనీని సైతం ఇస్తున్నారు.

గ్రేడ్-ఏ లో చోటు సంపాదించిన ఆటగాళ్లలో అశ్విన్ , జడేజా, భువీ, పూజారా, రహానే, ధోనీ, ధావన్, షమీ, ఇశాంత్, కుల్దీప్, రిషభ్ పంత్ ఉన్నారు. గ్రేడ్-బీ ఆటగాళ్లలో…రాహుల్, ఉమేశ్ యాదవ్, చాహల్, హార్థిక్ పాండ్యా నిలిచారు.

గ్రేడ్-సీ కాంట్రాక్టుకు అర్హత సాధించిన ఆటగాళ్లలో…కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, రాయుడు, మనీశ్ పాండే, హనుమ విహారి, ఖలీల్ అహ్మద్, వృద్ధిమాన్ సాహా ఉన్నారు.

మిథాలీరాజ్ కు 50 లక్షల కాంట్రాక్టు

మహిళా క్రికెటర్లకు సైతం…బీసీసీఐ తొలిసారిగా సెంట్రల్ కాంట్రాక్టు విధానం ప్రవేశపెట్టింది. గ్రేడ్-ఏ ప్లేయర్లకు ఏడాదికి 50 లక్షలు, గ్రేడ్- బీ ప్లేయర్లకు 30 లక్షలు, గ్రేడ్-సీ ప్లేయర్లకు 10 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది.

గ్రేడ్-ఏ లో చోటు సంపాదించిన మహిళా క్రికెటర్లలో వన్డే కెప్టెన్  మిథాలీ, టీ-20 కెప్టెన్  హర్మన్ ప్రీత్,  డాషింగ్ ఓపెనర్ స్మృతి మంథానా, సీనియర్ ప్లేయర్ పూనం యాదవ్ ఉన్నారు.

భారతజట్టులో చోటు సంపాదించిన తెలుగు తేజం అరుంధతి రెడ్డి…గ్రేడ్- సీ క్రికెటర్ గా ఏడాదికి 10 లక్షల రూపాయలు అందుకోనుంది. మొత్తం మీద…భారత క్రికెటర్లు…ప్రపంచ క్రికెట్లోనే అత్యధికంగా ఆర్జిస్తున్న వారిగా…రికార్డుల్లో చేరిపోయారు.