Telugu Global
NEWS

మహిళా దినోత్సవం వచ్చేసింది.... సాధికారత కే దిక్కులేదు

మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. తమ హక్కుల సాధన కోసం…. మంచి భవిష్యత్తు కోసం రాజకీయాలకు, కులమతాలకు, పేద ధనిక తేడా లేకుండా ప్రపంచ మహిళలందరూ జరుపుకునే పండుగ. ప్రతియేటా వచ్చినట్లుగానే ఈ ఏడాది వచ్చింది. అయితే మహిళల్లో మాత్రం గడచిన ఏడాదికి ఈ ఏడాదికి ఎలాంటి మార్పు లేదు. ముఖ్యంగా రాజకీయాలలో… అది కూడా తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో మహిళల స్థానం ఎదుగు బొదుగు లేకుండానే ఉందని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మహిళా […]

మహిళా దినోత్సవం వచ్చేసింది.... సాధికారత కే దిక్కులేదు
X

మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. తమ హక్కుల సాధన కోసం…. మంచి భవిష్యత్తు కోసం రాజకీయాలకు, కులమతాలకు, పేద ధనిక తేడా లేకుండా ప్రపంచ మహిళలందరూ జరుపుకునే పండుగ. ప్రతియేటా వచ్చినట్లుగానే ఈ ఏడాది వచ్చింది.

అయితే మహిళల్లో మాత్రం గడచిన ఏడాదికి ఈ ఏడాదికి ఎలాంటి మార్పు లేదు. ముఖ్యంగా రాజకీయాలలో… అది కూడా తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో మహిళల స్థానం ఎదుగు బొదుగు లేకుండానే ఉందని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మహిళా నాయకులు చెబుతున్నారు.

రాజకీయాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంశం గడచిన రెండున్నర దశాబ్దాలుగా అందని ద్రాక్షగానే మిగిలిందని అంటున్నారు. మహిళా సాధికారత గురించి ప్రతి యేటా మార్చి 8వ తేదీన మాట్లాడే రాజకీయ పార్టీల అగ్రనాయకులు 9వ తేదీ నుంచి మహిళలను చులకన చేయడం ప్రారంభిస్తారని వారు అంటున్నారు.

అన్ని రంగాలలోను మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రతి రాజకీయ పార్టీ ప్రకటిస్తున్నా…. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకురాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణ సాధన లో పోరాటం చేసిన మహిళలకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎలాంటి గుర్తింపు రాలేదన్నది తెలంగాణ మహిళా నాయకుల ఆవేదన. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి తొలి క్యాబినెట్ లో ఏ మహిళకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని తెలంగాణ మహిళా నాయకులు గుర్తు చేస్తున్నారు.

ఇటీవలే రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనాయకత్వం ఈసారి కూడా మహిళలకు మొండిచేయి చూపిందని అంటున్నారు. శాసనసభలో ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణలో మహిళలకు మొండిచేయి చూపుతున్నారని విమర్శిస్తే దానికి స్పందనగా త్వరలో మహిళలను మంత్రులుగా తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనపై ఎలాంటి నమ్మకం లేదని ఆ పార్టీకి చెందిన వారే చెబుతున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో అక్కలు, చెల్లెల్లు అంటూ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ…. మహిళలను చిన్న చూపు చూస్తోంది అనే అపవాదు ఉంది. ఆ పార్టీకి చెందిన శాసన సభ్యులు మహిళా ఉన్నతాధికారులపై చేయి చేసుకోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా రెవెన్యూ శాఖకు చెందిన ఉన్నతాధికారి శ్రీమతి వనజాక్షి పై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని చేయి చేసుకోవడాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని పార్టీలో మహిళా నాయకులు లోలోపల కుమిలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో మహిళలకు తగిన స్థానం లేదని అంటున్నారు.

జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కూడా మహిళలను చిన్నచూపు చూస్తున్నాయని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి మార్చి 8… అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది. ఈసారి కూడా నాయకుల ప్రసంగాలు, మహిళలను ఉద్ధరిస్తున్నామంటున్న ప్రకటనలు వెలువడతాయి తప్ప మహిళలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మహిళా నాయకురాళ్లు కుండబద్దలు కొడుతున్నారు.

First Published:  7 March 2019 8:51 PM GMT
Next Story