Telugu Global
Others

కర్మయోగానికి పట్టిన ఖర్మ

 “పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగిన మొదటి ప్రధాని మోదీ” ఇదీ సామాజిక మాధ్యమాలలో తిరుగుతున్న సందేశం. నిజమే ఈ పని చేసిన మొదటి ప్రధాని మోదీనే. అనుమానం లేదు. అయితే కాళ్లు కడగడం ఏ సంస్కృతికి నిదర్శనమో గ్రహించాలి. అది పచ్చి ఫ్యూడల్ సంస్కృతి. మోదీ హయాంలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ఏం జరిగిందో తరచి చూడాలి. 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో ఏమీ జరగలేదుగా అన్నది సమాధానం కాదు. కాంగ్రెస్ విఫలమైందనుకున్నందువల్లే జనం మోదీకి […]

కర్మయోగానికి పట్టిన ఖర్మ
X

“పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగిన మొదటి ప్రధాని మోదీ” ఇదీ సామాజిక మాధ్యమాలలో తిరుగుతున్న సందేశం. నిజమే ఈ పని చేసిన మొదటి ప్రధాని మోదీనే. అనుమానం లేదు. అయితే కాళ్లు కడగడం ఏ సంస్కృతికి నిదర్శనమో గ్రహించాలి. అది పచ్చి ఫ్యూడల్ సంస్కృతి. మోదీ హయాంలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ఏం జరిగిందో తరచి చూడాలి. 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో ఏమీ జరగలేదుగా అన్నది సమాధానం కాదు. కాంగ్రెస్ విఫలమైందనుకున్నందువల్లే జనం మోదీకి పట్టం కట్టారు.

సానుభూతికి సహానుభూతికి తేడా ఉంది. ఎవరకైనా ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఆపద వచ్చినా అయ్యో అనడం సానుభూతి. వారి బాధలు నివారించడానికి చేయగలిగినంత చేయడం సహానుభూతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సఫాయి కార్మికుల మీద సానుభూతే కాదు, సహానుభూతీ అపారంగా ఉన్నట్టుంది. బుధవారం నాడు ఆయన కుంభమేళాలో పారిశుద్ధ్య పనులు నిర్వహించిన వారిని ప్రశంసించారు.

ఫిబ్రవరి 24న మోదీ ప్రయాగ్ రాజ్ లో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు. కుంభమేళాలో ఆ కార్మికులు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పని చేశాను అని మోదీ చెప్పారు. వారు నిజమైన కర్మయోగులని అన్నారు. “కుంభ మేళా సందర్భంగా వాళ్లు ఎంత శ్రమిస్తున్నరో ఎవరికీ తెలియదు. ఈ కుంభ మేళా ప్రత్యేకత పారిశుద్ధ్యమే. మీ ఆశీస్సులు నాకు ఉంటాయని ఆశిస్తున్నాను. మీకు సేవలు అందిస్తూనే ఉంటాను” అని మోదీ అన్నారు.

కుంభమేళా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమ నిధికి వ్యక్తిగతంగా 21 లక్షలు మోదీ అందజేసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ఇది సహానుభూతే. ప్రయాగ్ రాజ్ లో (అదే మునుపు అలహాబాద్ అనే వాళ్లం లెండి) జరిగిన కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడం సహజం. అక్కడ పారిశుద్ధ్యం సవ్యంగా ఉండవలసిందే. ఆ పని సఫాయి కార్మికులు బాగా చేసినందుకు మోదీ అభినందించడం మెచ్చుకోదగ్గదే. సమాజంలో అట్టడుగున ఉన్న వారి శ్రమను మెచ్చుకునే ప్రధానమంత్రి ఉన్నందుకు సంతోషించవలసిందే.

మోదీ వాళ్లను “కర్మ యోగులు” అన్నారు. కర్మ అంటే పురుష ప్రయత్నం, పట్టుబట్ట, పౌరుషం అన్న అర్థాలూ ఉన్నాయి. కర్మ అన్న మాటను “ఖర్మ” అని కూడా వాడతాం. ఖర్మ అని వాడితే దిక్కులేక అన్న అర్థం వస్తుంది. మోదీ కర్మ అన్న అర్థంలోనే వాడి ఉంటారనుకోవాలి. ఎందుకంటే కర్మను ఖర్మ అని వాడడం తెలుగులో అయితే ఉంది కానీ ఉత్తరాది భాషల్లో ఉండే అవకాశం తక్కువ. సఫాయి కర్మచారులు సాంకేతికత బాగా అభివృద్ధి చెందిన ఈ దశలో కూడా విషవాయువులు విరజిమ్మే మురికి కాలవల్లోకి దిగి శుభ్రం చేయడం, ఆ క్రమంలో ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇతరుల మలాన్ని తల మీద మోసుకెళ్లి పారబోయడం తప్పకపోవడం వారి ఖర్మే.

మోదీ దృష్టిలో సఫాయి కర్మచారులు కర్మయోగులు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో “కర్మయోగ్” అనే గ్రంథం కూడా రాశారు. ఇది ఉన్నతాధికారులకు మోదీ ఉపదేశాలతో కూడింది. చింతన్ శిబిరం పేరుతో ప్రతి సంవత్సరం జరిగే ఉన్నతాధికారుల సమావేశంలో మోదీ వారు ఎలా మసలుకోవాలో ఉపదేశాలిచ్చే వారు. ఈ ఉపదేశాలన్నీ కలిపి ఈ గ్రంథం ప్రచురించారు. ఈ పుస్తకం 5000 ప్రతులు ముద్రించారు. ఇది అందంగా ముద్రించారు.

అయితే ఈ పుస్తకం ముద్రించిన దాదాపు నెల తరవాత గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయిగనక వీటిని పంపిణీ చేయలేదు. ఈ గ్రంథ ప్రచురణకు కావలసిన నిధులు సమకూర్చే పనిని అందుకే గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ కు అప్పగించారు.

మోదీ రాసిన “కర్మ యోగ్” గ్రంథంలో ఈ పనిని “ఆధ్యాత్మిక అనుభవం” అన్నారు. ఆయన మాటల్లోనే చెప్తే, “కేవలం బతకడం కోసం వారు ఈ పని చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. ఒక వేళ బతుకుదెరువుకోసమే అయితే తరతరాలుగా వారు ఈ పని కొనసాగించరు. ఏదో ఒక సమయంలో వాల్మీకుల్లో ఎవరో ఒకరికి మొత్తం సమాజం సంతోషంగా ఉండడానికి, దేవుడిని సంతృప్తి పరచడానికి ఈ పని చేయాలని అనుకుని ఉంటారు.

ఈ బాధ్యత తమకు భగవంతుడు అప్పగించిన బాధ్యత అనుకుంటారు. అంతర్గత ఆధ్యాత్మిక కార్యకలాపంగా భావించి వారు శతాబ్దాలుగా ఈ పని చేస్తూ ఉండి ఉంటారు. ఇది తరాతరాల నుంచి కొనసాగుతూ ఉండి ఉంటుంది. వారి పూర్వీకులు మరో వృత్తి చేపట్టడానికి అవకాశం లేదు అనుకోవడం అసాధ్యం” అని మోదీ ఈ గ్రంథంలో రాశారు.

అంటే మోదీకి ఇందులో ఆధ్యాత్మిక అనుభవమో, ఆనందమో కనిపించింది కానీ సాంకేతికత విపరీతంగా పెంపొందిన దశలో ఒక మనిషి మలాన్ని మరొకరు ఎత్తివేయడం, విషవాయులు గుప్పే మురికి కాలవల్లో దిగి శుభ్రం చేసే దురవస్థ తప్పనందుకు ఆయనలో ఏ మాత్రం బాధ కనిపించలేదు. మనుషుల మలం ఎత్తిపోస్తూ ఆధ్యాత్మిక అనుభవమో, ఆనందమో అనుభవిస్తున్నారు అని చెప్పడానికి కనీస మానవత్వ విలువలు లోపించడం తప్ప మరో కారణం ఏదీ కనిపించదు.

పారిశుద్ధ్య కార్మికులు, పూజారులు ఒకే లాంటి వారనీ పూజారులు ఆలయాలు శుభ్రం చేస్తే పారిశుద్ధ్య కార్మికులు పాకీ దొడ్లు మురికి కాలవలు శుభ్రం చేస్తారు అని మోదీ సెలవిచ్చారు. అతి హేయమైన పని చేసే వారిని అర్చకులతో పోల్చడం మోదీ “హృదయ వైశాల్యత” కు నిదర్శనం కాబోలు. ఆయన అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో “మంచి రోజులు” ముంచుకొస్తాయన్న భ్రమ ఎవరికీ లేదు. అందుకే నితిన్ గడ్కరీలాంటి వారు అమలు చేయలేని వాగ్దానాలన్నీ గుప్పించి కూర్చున్నాం అని వాపోయారు. రాందేవ్ బాబాలాంటి వారూ మోదీ వైఫల్యాలమీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి రాజీవ్ షా చేతికి కర్మయోగ్ పుస్తకం యాదృచ్ఛికంగా అందింది. ఆయన ఆ పుస్తకం తిరగేస్తే మోదీ “అమూల్య” అభిప్రాయాలు కనిపించాయి. దీనిమీద దళిత నాయకుల అభిప్రాయం ఏమిటో తెలుసుకోవడానికి రాజీవ్ షా తన వృత్తి ధర్మం పాటించారు. గుజరాత్ లో అత్యంత సీనియర్ దళిత నాయకుడైన ఫకీర్ భాయ్ వాఘేలాను కలుసుకున్నారు. సదరు వాఘేలా బీజేపీ నాయకుడే. రాజీవ్ ఆయన దగ్గరకెళ్లీ మోదీ “అమూల్య” అభిప్రాయాలు చదివి వినిపించారు.

అయితే ఈ అభిప్రాయాలు ఎవరివో ముందు చెప్పలేదు. వాఘేలా తనకు వినిపించిన ఆ భాగాలు విని “ఎవరా దుర్మార్గుడు? ఈ చెత్త రాసింది ఎవరు?” అని ఉగ్ర రూపం ప్రదర్శించారు. రాజీవ్ షా ఈ మాటలు మోదీ గ్రంథంలోనివి అని చెప్పారు. అప్పుడు ఫకీర్ భాయ్ వాఘేలా ఎన్నికల్లో పోటీ చేయడానికి సకల ప్రయత్నాలూ చేస్తున్నారు.

అప్పుడు “నన్ను ఇబ్బందిలో పెట్టకు. నేను ఈ పుస్తకం మీద వ్యాఖ్యానించేదేమీ లేదు. అసలు నేనా పుస్తకమే చూడలేదనుకో” అన్నారు. మోదీ మీద ఆ దళిత నాయకుడు విమర్శలు గుప్పిస్తే ఇంకేమైనా ఉందా! అందుకే ఫకీర్ భాయ్ వాఘేలా తనకు టికెట్టు రావడమే దళితుల ఆత్మగౌరవ పరిరక్షణకన్నా ఎక్కువ అనుకున్నారు.

రాజీవ్ షా రాసిన వార్త 2007 నవంబర్ మధ్యలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది. అందరూ ఎన్నికల హడావుడిలో ఉన్నారు కనక ఎవరూ ఈ వార్తను పట్టించుకోలేదు. కాంగ్రెస్ నాయకులూ పట్టించుకోలేదు. కొన్ని రోజుల తరవాత రాజీవ్ మళ్లీ తనకు ఆ పుస్తకం ఇచ్చిన మోదీ ప్రిన్సిపల్ సెక్రెటరీ కైలాశ్ నాథన్ దగ్గరకు వెళ్లారు. “నువ్వెంత ఉపద్రవం సృష్టించావ్? నా పుస్తకం నాకు ఇచ్చేయి” అని గుడ్లురిమారు.

గుజరాత్ లో ఈ విషయం ఎవరూ పట్టించుకోలేదుగా ఇక ఉపద్రవం ఎక్కడిది అని రాజీవ్ బదులిచ్చారు. “కానీ తమిళనాడులో దాని అనువాదం అచ్చయింది. అక్కడ మోదీ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు” అని కైలాశ్ నాథన్ అన్నారు. ఆ తరవాత మోదీ ఆదేశాల మేరకు గుజరాత్ సమాచార శాఖ ఈ పుస్తకాన్ని ఉపసం హరించింది.

అయితే రాజీవ్ షా పుస్తకం తిరిగి ఇచ్చేసే ముందు వాల్మీకుల గురించి మోదీ రాసిన భాగాలను స్కాన్ చేసి తన మిత్రులకు పంపించారు. రాజకీయ నాయకుడిగా మారిన దళిత కార్యకర్త ప్రవీణ్ రాష్ట్ర పాల్ ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. మోదీ దళిత వ్యతిరేకి అని దుయ్యబట్టారు. ఇదంతా ఓ ఏడాది తరవాత జరిగింది. రాజ్యసభలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చిన తరవాతే కాంగ్రెస్ మేల్కొంది.

వాల్మీకుల ఓట్లు సంపాదించడానికే మోదీ వాళ్లను కర్మయోగులు అన్నారు. గత రెండేళ్ల కాలంలో మురికి కూపాలను శుభ్రం చేసే క్రమంలో 233 మంది సఫాయి కర్మచారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేశంలో పాత పద్ధతిలోని మరుగుదొడ్లు దాదాపు కోటి దాకా ఉన్నాయి. వీటిని మనుషులు శుభ్రం చేయవలసిందే.

“మా పాదాలను కాదు మీ బుర్రలు శుభ్రం చేసుకోండి ప్రధాని గారూ! చాలా అవమానకరంగా ఉందీ పని. 1.6 లక్షలమంది మహిళలు ఇంకా మానవ వ్యర్థాలను ఎత్తిపోసే పని నిర్బంధంగా చేయాల్సి వస్తోంది. వాళ్ల గురించి ఈ అయిదేళ్లలో ఒక్క మాట మాట్లాడలేదు” అని సఫాయి కర్మాచారీ ఆందోళన్ నడుపుతూ రామన్ మెగ్సెసే అవార్డు పొందిన బెజవాడ విల్సన్ వ్యాఖ్యానించారు. అదేం విచిత్రమో కానీ మెగ్సెసే అవార్డు వచ్చిన వారిలో చాలా మంది మోదీని విమర్శిస్తూనే ఉన్నారు.

“అసలు సమస్య ప్రధాని అర్థం చేసుకోవాలి. చీపురు పట్టుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. స్వచ్ఛ భారత్ ప్రారంభించిన గత నాలుగేళ్లలో ఒక్క సారి కూడా ప్రధాని పారిశుద్ధ్య కార్మికుల మరణాల గురించి మాట్లాడలేదు. సఫాయి కర్మచారులను కాపాడడానికి ఆయన ఏం చేస్తారో చెప్పాలి” అన్నారు బెజవాడ విల్సన్.

పారిశుద్ధ్య కార్మికుల స్వయం ఉపాధి పథకం కోసం 2013 బడ్జెట్ లో రూ. 557 కోట్లు కేటాయించారు. అప్పుడు యు.పి.ఎ. అధికారంలో ఉంది. ఆ తరవాత మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత 2014-15 బడ్జెట్ లో 448 కోట్లు, 2015-16 బడ్జెట్ లో 470 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. అయితే 2016-17లో కేవలం 10 కోట్లు, 2017-18 బడ్జెట్ లో అయిదు కోట్లు, 2018-19లో 20 కోట్లు కేటాయించారు. కర్మయోగుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వ శ్రద్ధ ఏమిటో ఈ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.

మనుషుల మలాన్ని ఎత్తేసే పని చేసే వాళ్లు సాధారణంగా దళితులే. అందులోనూ వాల్మీకులు ఈ పని చేస్తుంటారు. ఇలా మనుషుల మలాన్ని మరో మనిషి ఎత్తేసే దౌర్భాగ్య స్థితి క్రమంగా తగ్గుతున్న మాట నిజమే. కానీ ఇంకా చాలా చోట్ల ఆధునిక శౌచాలయాలు లేవు. మరి పాకీ దొడ్లు కడిగేవాళ్లు లేకపోతే ఎలా? వారి చేత పని చేయించుకోవాలంటే వారికి ఆ హేయమైన పని దైవదత్తమన్న ఆధ్యాత్మిక భావన కలిగించాల్సిందే.

కొసమెరుపు: దేశ విభజన సమయంలో మన దేశంలోని కొందరు ముస్లింలు పాకిస్తాన్ వెళ్లి స్థిరపడితే, పాకిస్తాన్ లోని చాలా మంది హిందువులు భారత్ వచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు భారత్ రావడాన్ని పాక్ సహించలేదు. వారిని అడ్డుకున్నారు. వారి కర్మ వారు నిర్వర్తించకపోతే పాకిస్తానీయులకు “ఖర్మే” మిగిలేదిగా. కర్మయోగానికి ఉన్న శక్తి అలాంటిది. దేవుడొక్కడే అంటారు కనక కర్మయోగులు పాకిస్తానీయులైనా, భారతీయులైనా వారి కర్మ వారు నిర్వర్తిస్తూ ఉండాల్సిందే. అందుకే గదా మనది కర్మ భూమి.

First Published:  8 March 2019 2:00 PM GMT
Next Story