Telugu Global
NEWS

బాబు గారూ... మీ సుపుత్రుడికి ఒక రూలు... మా పిల్లలకు ఇంకో రూలా!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సన్ స్ట్రోక్  తగులుతోంది. వేసవి కాలం కదా…చంద్రబాబునాయుడుకే కాదు అందరికీ తగులుతుంది అనుకుంటున్నారా! ఈ సన్ స్ట్రోక్ వేసవికాలంలో వచ్చేది కాదు. ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది కాదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు సుపుత్రుడు లోకేష్ ద్వారా ఈ సన్ స్ట్రోక్ తగిలింది. రానున్న ఎన్నికలలో తన కుమారుడు లోకేష్ ని విశాఖపట్నం జిల్లా భీమిలి […]

బాబు గారూ... మీ సుపుత్రుడికి ఒక రూలు... మా పిల్లలకు ఇంకో రూలా!
X

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సన్ స్ట్రోక్ తగులుతోంది. వేసవి కాలం కదా…చంద్రబాబునాయుడుకే కాదు అందరికీ తగులుతుంది అనుకుంటున్నారా! ఈ సన్ స్ట్రోక్ వేసవికాలంలో వచ్చేది కాదు. ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది కాదు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు సుపుత్రుడు లోకేష్ ద్వారా ఈ సన్ స్ట్రోక్ తగిలింది. రానున్న ఎన్నికలలో తన కుమారుడు లోకేష్ ని విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచి ఎన్నికల బరిలో నిలపాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఏ తండ్రికైనా తన పుత్ర రత్నం ఎదగాలని కోరుకోవడం సహజమే. అయితే, తమ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఇతర నాయకుల వారసులెవరు ఎన్నికల బరిలో నిలవ కూడదు అంటూ కొత్త నిబంధన విధిస్తున్నారు. ఇదిగో ఈ నిబంధన తోనే పార్టీ సీనియర్ నాయకులు మీ కుమారుడికి ఒక రూలు…. మా పిల్లలకు మరో రూలా అంటూ లోలోపల సతమతమవుతున్నారు.

రానున్న ఎన్నికలలో తన స్థానంలో తన కుమారుడికి అనంతపురంలో టిక్కెట్ ఇవ్వాలంటూ సీనియర్ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుని కోరారు. ఈ అభ్యర్థనపై చంద్రబాబు పెదవి విప్పలేదు. ఇక ఇదే జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కూడా ఈసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. పార్టీ సీనియర్ నాయకుడైన దివంగత పరిటాల రవి కుమారుడైన పరిటాల శ్రీరామ్ కు సైతం మొండి చెయ్యి చూపించారు చంద్రబాబు నాయుడు.

ఆ పక్కనే ఉన్న కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు టీ జీ వెంకటేష్ కుమారుడు భరత్ కూడా కర్నూలు నగరం సీటు కోరుతున్నారు. ఈ సీటు వ్యవహారంపై కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదు. తన కుమారుడు నారా లోకేష్ పోటీ చేయాలనుకుంటున్న విశాఖ జిల్లాలో కూడా కొందరు తెలుగుదేశం నాయకులు తమ కుమారులకు టిక్కెట్లు ఇవ్వాలని ఆశించారు. వారిలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఉన్నారు. ఈసారి ఎన్నికలలో నర్సీపట్నం నుంచి ఆయన కుమారుడు విజయ్ కి అవకాశం ఇవ్వాలంటూ చంద్రబాబును కోరారు. దీనికి సమాధానంగా చంద్రబాబు నాయుడు “నువ్వే పోటీ చేయాలి…. భయపడుతున్నావా” అంటూ తీసిపారేశారు.

ఇదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నాయకుడు ఆడారి తులసీరావు కూడా తన కుమారుడు ఆనంద్ అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని, అవకాశం ఇవ్వాలని కోరారు. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు తిరస్కరించారు. దివంగత సీనియర్ నాయకుడు ఎంవీవీఎస్ మూర్తి మనవడు, తన వియ్యంకుడు, సినీ హీరో బాలకృష్ణ అల్లుడు భరత్ కు విశాఖ లోక్ సభ స్థానం కేటాయించాలని కూడా కోరారు. దీనికి చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు.

ఇక విజయవాడకు చెందిన దేవినేని నెహ్రు కుమారుడు, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఆశపడ్డారు. అక్కడ ఎంతో బలంగా ఉన్న దేవినేని అవినాష్ ను గుడివాడ నుంచి పోటీ చేయాలంటూ ఆయన కోరుకుంటున్న స్థానాన్ని మార్చేశారు.

ఇలా చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ కు ఒక రూలు…. పార్టీలో ఇతర సీనియర్ నాయకుల కుమారులకు మరొక రూలు పాటిస్తూ సీనియర్ల ఆగ్రహానికి గురవుతున్నారని అంటున్నారు. తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ పుత్రోత్సాహం పార్టీ పుట్టి ముంచుతుందని సీనియర్ నాయకులు చెబుతున్నారు.

First Published:  10 March 2019 2:30 AM GMT
Next Story