Telugu Global
NEWS

వన్డే క్రికెట్లో కెప్టెన్ గా విరాట్ కొహ్లీ రికార్డుల మోత

అత్యంత వేగంగా 4 వేల పరుగుల వన్డే కెప్టెన్ కొహ్లీ వన్డేల్లో 41, టెస్టుల్లో 25 శతకాల కొహ్లీ 410 ఇన్నింగ్స్ లోనే కొహ్లీ 66 సెంచరీలు ఆధునిక క్రికెట్లో సంవత్సరాలు, సిరీస్ లు గడచిపోతున్నా…టీమిండియా కెప్టెన్ కమ్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ రికార్డుల మోత మాత్రం అప్రతిహతంగా కొనసాగుతోంది. పరుగుల హోరు,  సెంచరీల జోరుతో పాటు… రికార్డుల మోతను సైతం కొహ్లీ మోగిస్తున్నాడు. ఆసీస్ తో గత రెండు వన్డేల్లోనూ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు […]

వన్డే క్రికెట్లో కెప్టెన్ గా విరాట్ కొహ్లీ రికార్డుల మోత
X
  • అత్యంత వేగంగా 4 వేల పరుగుల వన్డే కెప్టెన్ కొహ్లీ
  • వన్డేల్లో 41, టెస్టుల్లో 25 శతకాల కొహ్లీ
  • 410 ఇన్నింగ్స్ లోనే కొహ్లీ 66 సెంచరీలు

ఆధునిక క్రికెట్లో సంవత్సరాలు, సిరీస్ లు గడచిపోతున్నా…టీమిండియా కెప్టెన్ కమ్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ రికార్డుల మోత మాత్రం అప్రతిహతంగా కొనసాగుతోంది. పరుగుల హోరు, సెంచరీల జోరుతో పాటు… రికార్డుల మోతను సైతం కొహ్లీ మోగిస్తున్నాడు. ఆసీస్ తో గత రెండు వన్డేల్లోనూ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదిన కొహ్లీ… తాజా రికార్డులు ఓసారి చూద్దాం…

పరుగుల హోరు-సెంచరీల జోరు…

ధూమ్ ధామ్ వన్డే క్రికెట్లో.. టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ దూకుడు కొనసాగుతోంది. సిరీస్ వెంట సిరీస్….ఏడాది తర్వాత ఏడాది మారుతున్నా… టీమిండియా రన్ మెషీన్ పరుగుల, సెంచరీల దాహం ఏమాత్రం తీరడంలేదు.

ప్రపంచకప్ కు సన్నాహకంగా ఐదుసార్లు విజేత ఆస్ట్రేలియాతో జరుగుతున్న పాంచ్ పటాకా సిరీస్ లోని మొదటి మూడు వన్డేలలోనే కొహ్లీ రెండు శతకాలు బాది…టీమిండియా కెప్టెనా ?…మజాకానా ? అనిపించుకొన్నాడు.

నాగపూర్ విదర్భ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ముగిసిన రెండో వన్డేలో ప్రస్తుత సిరీస్ తొలిశతకం బాదిన కొహ్లీ….

41 వన్డే సెంచరీల కొహ్లీ…

రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ సంఘం స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో సైతం అదే దూకుడు కొనసాగించాడు. తన కెరియర్ లో వన్డే సెంచరీల సంఖ్యను 41కు పెంచుకొన్నాడు. కేవలం 95 బాల్స్ లోనే 16 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 123 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా విరాట్ కొహ్లీకి ఇది ఎనిమిదో శతకం కావడం మరో విశేషం.

అంతేకాదు…కెప్టెన్ గా అత్యంత వేగంగా 4వేల పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ పేరుతో ఉన్న 77 ఇన్నింగ్స్ ప్రపంచ రికార్డును… కొహ్లీ 63 ఇన్నింగ్స్ లోనే 4వేల పరుగుల మైలురాయిని చేరాడు.

అంతేకాదు…వన్డే క్రికెట్లో అత్యధిక సగటు సాధించిన క్రికెటర్ల వరుస రెండోస్థానంలో కొహ్లీ చోటు సంపాదించాడు. ఆసీస్ క్రికెటర్ మైకేల్ బేవన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ప్రస్తుత రాంచీ వన్డే వరకూ కొహ్లీ ఆడిన 211 ఇన్నింగ్స్ లో 60.08 సగటు నమోదు చేశాడు.

410 ఇన్నింగ్స్ లో 66 సెంచరీలు…

విరాట్ కొహ్లీ…క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలసి 66 శతకాలు బాదడం ద్వారా…మాస్టర్ సచిన్, రికీ పాంటింగ్ ల తర్వాతి స్థానంలో నిలిచాడు. సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో 25, ధూమ్ ధామ్ వన్డే క్రికెట్లో 41 సెంచరీలు బాదడం ద్వారా…తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 66కు పెంచుకొన్నాడు.

మాస్టర్ సచిన్ 782 ఇన్నింగ్స్ లో 100 శతకాలు, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 668 ఇన్నింగ్స్ లో 71 సెంచరీలు సాధించారు. విరాట్ కొహ్లీ మాత్రం 66 శతకాలను కేవలం 410 ఇన్నింగ్స్ లోనే సాధించడం మరో ఘనతగా మిగిలిపోతుంది.

దిగ్గజాల రికార్డుకు కొహ్లీగురి….

కెప్టెన్ గా పరుగులు సాధించడంలోనే కాదు….శతకాలు బాదడంలోనూ కొహ్లీ తనకు తానే సాటిగా, పోటీగా నిలిచాడు. కెప్టెన్ గా కొహ్లీ మొత్తం 160 ఇన్నింగ్స్ లో 37 శతకాలు సాధించాడు.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 376 ఇన్నింగ్స్ లో 41 సెంచరీలు సాధించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

పాంటింగ్ పేరుతో ఉన్న 41 శతకాలు, మాస్టర్ సచిన్ పేరుతో ఉన్న 100 సెంచరీల రికార్డులను రానున్నకాలంలో కొహ్లీ అధిగమించినా ఆశ్చర్యం లేదు.

ప్రస్తుత పాంచ్ పటాకా సిరీస్ లోని ఆఖరి రెండు వన్డేలలోనూ కొహ్లీ సెంచరీల వేట కొనసాగుతుందా?…లేదా ? అన్నదే ఇక్కడి అసలుపాయింట్.

First Published:  10 March 2019 2:40 AM GMT
Next Story