కమల్ పార్టీకి గుర్తు కేటాయించిన ఈసీ

తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు కమల్ హాసన్. అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా ఉండాలనుకుంటారు. తన రాజకీయ ప్రస్థానమూ అలాగే ప్రారంభించారు. ప్రశ్నించడానికే తన పార్టీ అని ఆవిర్భావ దినం రోజునే ప్రకటించారు.

ఇక తాజాగా కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చిలైటును గుర్తుగా కేటాయించింది. ఈ సందర్భంగా ఆయన ఈసీకి ట్వీట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఇది మా పార్టీకి సరైన గుర్తని ఆయన అభివర్ణించారు. తమిళనాడులోనే కాక భారతీయ రాజకీయ చరిత్రలో మక్కల్ నీది మయ్యం పార్టీ ఇక టార్చ్ బేరర్‌గా మారబోతోందని కమల్ చెబుతున్నారు.

ఇక రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి కమల్ సన్నద్దం అవుతున్నారు. ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఒక వేళ డీఎంకే పార్టీతో కాంగ్రెస్ తెగతెంపులు చేసుకుంటే మాత్రం దానితో చేతులు కలపడానికి తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.