Telugu Global
NEWS

శతట్రోఫీల మొనగాడు రోజర్ ఫెదరర్

310 వారాలపాటు టాప్ ర్యాంక్ లో ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఒకే ఒక్కడు 1989లో కానర్స్-2019లో ఫెదరర్ టెన్నిస్ ఎవర్ గ్రీన్ స్టార్ రోజర్ ఫెదరర్…36 ఏళ్ల వయసులోనూ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఏటీపీ టూర్ చరిత్రలోనే…వంద టైటిల్స్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. 2019 దుబాయ్ ఓపెన్ టైటిల్ సాధించడం ద్వారా ఈ ఘనత సాధించాడు. రాయల్ గేమ్ టెన్నిస్ లో తరాలు మారుతున్నా…స్విట్జర్లాండ్ కూల్ కూల్ స్టార్, టెన్నిస్ ఎవర్ […]

శతట్రోఫీల మొనగాడు రోజర్ ఫెదరర్
X
  • 310 వారాలపాటు టాప్ ర్యాంక్ లో ఫెదరర్
  • 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఒకే ఒక్కడు
  • 1989లో కానర్స్-2019లో ఫెదరర్

టెన్నిస్ ఎవర్ గ్రీన్ స్టార్ రోజర్ ఫెదరర్…36 ఏళ్ల వయసులోనూ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఏటీపీ టూర్ చరిత్రలోనే…వంద టైటిల్స్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. 2019 దుబాయ్ ఓపెన్ టైటిల్ సాధించడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

రాయల్ గేమ్ టెన్నిస్ లో తరాలు మారుతున్నా…స్విట్జర్లాండ్ కూల్ కూల్ స్టార్, టెన్నిస్ ఎవర్ గ్రీన్ గ్రేట్ రోజర్ ఫెదరర్ జోరు మాత్రం కొనసాగుతూనే ఉంది.

రెండుదశాబ్దాల తన టెన్నిస్ కెరియర్ లో ఇప్పటికే 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెదరర్… 2019 దుబాయ్ మాస్టర్స్ ఓపెన్ విజయంతో తన ATP టూర్ టైటిల్స్ సంఖ్యను 100కు పెంచుకోడం ద్వారా… ఆల్ టైమ్ గ్రేట్ జిమ్మీ కానర్స్ సరసన చోటు సంపాదించాడు.

అప్పుడు జిమ్మీ- ఇప్పుడు రోజర్…

అంతర్జాతీయ టెన్నిస్ లో పోటీ అంతాఇంతాకాదు. అదీ ప్రొఫెషనల్ టెన్నిస్ లో ఒక్క టైటిల్ సాధించగలిగితేనే ఎంతో గొప్పగా భావిస్తారు. ఒక్క టైటిల్ తో ఆగిపోకుండా…తమ కెరియర్ ను సుదీర్ఘంగా కొనసాగించడంతో పాటు…వంద టైటిల్స్ సాధించిన ఆటగాళ్లు….టెన్నిస్ చరిత్రలో ఇద్దరంటే ఇద్దరు మాత్రమే ఉన్నారు.

1970 దశకంలో అలనాటి అమెరికన్ స్టార్ ప్లేయర్ జిమ్మీ కానర్స్ వంద ఏటీపీ టూర్ టైటిల్స్ సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. 1972- 1989 మధ్యకాలంలో కానర్స్ వంద టైటిళ్లు నెగ్గిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత దాదాపు ఐదు దశాబ్దాల విరామం తర్వాత స్విట్జర్లాండ్ ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ అదే ఘనతను సొంతం చేసుకొన్నాడు.

1998 టు 2019

రోజర్ ఫెదరర్ 1998లో జూనియర్ వింబుల్డన్ టైటిల్ సాధించిన తర్వాత తొలి ఏటీపీ టూర్ టైటిల్ కోసం 48 టోర్నీలపాటు వేచిచూడాల్సి వచ్చింది.

గత 20 సంవత్సరాల కాలంలో ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో పాటు.. ఆరు ఏటీపీ ఫైనల్స్, 27 ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్స్, 22 ఏటీపీ 500 టైటిల్స్, 25 ఏటీపీ 250 గ్రేడ్ టైటిల్స్ సంపాదించాడు.

ఏటీపీ టూర్ తొలి టైటిల్ కోసం 48 టోర్నీల పాటు ఎదురుచూసిన ఫెదరర్…కేవలం ఆరేళ్ల కాలంలోనే 57 టోర్నీలు నెగ్గి వారేవ్వా అనిపించుకొన్నాడు.

గ్రాస్ కోర్టు కింగ్….

ఫెదరర్ సాధించిన మొత్తం 100 ఏటీపీ టూర్ టైటిల్స్ లో పచ్చిక కోర్టుల్లో సాధించిన 18 టోర్నీలలో ఎనిమిది వింబుల్డన్ టైటిల్సే కావడం విశేషం. హార్డుకోర్టులో 69, క్లే కోర్టులో 11, కార్పెట్ కోర్టుల్లో 2 టైటిల్స్ చొప్పున ఫెదరర్ సాధించాడు.

గ్రాస్ కోర్ట్ టెన్నిస్ లో 168 విజయాలు… 24 పరాజయాల రికార్డు ఉన్న ఫెదరర్ 87.5 విజయశాతంతో 18 టైటిల్స్ నెగ్గాడు. ఇందులో ఎనిమిది వింబుల్డన్ ట్రోఫీలు సైతం ఉన్నాయి.

ఇక..హార్డ్ కోర్టు టెన్నిస్ లో ఫెదరర్ అత్యధికంగా 725 విజయాలు….145 పరాజయాల రికార్డుతో 70 టైటిల్స్ సంపాదించాడు. ఇందులో అమెరికన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ సైతం ఉన్నాయి.

అంతేకాదు…క్లే కోర్టు టెన్నిస్ లో 214 విజయాలు, 68 పరాజయాల రికార్డుతో ఉన్న ఫెదరర్…ఒకే ఒక్కసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలవటం విశేషం. ఫెదరర్ సాధించిన మొత్తం 100 టైటిల్స్ లో.. 11 క్లే కోర్టు టైటిల్స్ సైతం ఉన్నాయి.

నంబర్ వన్ రికార్డు….

36 ఏళ్ల లేటు వయసులో 100 టూర్ టైటిల్స్ నెగ్గిన ఫెదరర్…ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడంలోనూ తనకు తానే సాటిగా నిలిచాడు. మొత్తం 310 వారాలపాటు…ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా గుర్తింపు తెచ్చుకొన్న ఏకైక ఆటగాడు ఫెదరర్ మాత్రమే.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఓపెన్ యుగం పురుషుల విభాగంలో …20 సింగిల్స్ టైటిల్స్ సాధించిన తొలిప్లేయర్ గా నిలిచాడు. మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనాలో ముగిసిన.. 2018 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిచ్ ను ఐదుసెట్ల పోరులో ఫెదరర్ అధిగమించడం ద్వారా..20వ గ్రాండ్ స్లామ్ ట్రోఫీ అందుకొన్నాడు. 36 ఏళ్ల ఫెదరర్ ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ చేరడమే కాదు…ఆరుసార్లు విజేతగా నిలిచాడు.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ 30సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫైనల్స్ ఆడిన ఫెదరర్ 20 టైటిల్స్ తో పాటు…332 విజయాలు, 52 పరాజయాల రికార్డుతో నిలిచాడు.

ఏటీపీ టూర్ టైటిల్స్ చిట్టా…

ఫెదరర్ అత్యధికంగా సాధించిన గ్రాండ్ స్లామ్ టూర్ టైటిల్స్ లో 9 బాసెల్ ఓపెన్, 9 హాలే ఓపెన్, 8 వింబుల్డన్, 8 దుబాయ్ఓపెన్, 7 సిన్సినాటీ, 6 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉన్నాయి.

2001 సీజన్ లో మిలన్ టైటిల్ తో ఏటీపీ టూర్ టైటిళ్ల వేట ప్రారంభించిన ఫెదరర్ 2003లో వియన్నా ఓపెన్ విజయంతో తన టైటిళ్ల సంఖ్యను పదికి పెంచుకొన్నాడు.2005 సీజన్ దుబాయ్ ఓపెన్ విజయం ఫెదరర్ కు 25 టైటిల్ కాగా..2007 సిన్సినాటీ గెలుపుతో 50కి పెంచుకొన్నాడు. 2019 దుబాయ్ ఓపెన్ తో ఫెదరర్ రికార్డుస్థాయిలో టైటిళ్ల సెంచరీ పూర్తి చేయగలిగాడు.

19 దేశాల వేదికలపై విజయం…

ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాల గడ్డపై జరిగిన వివిధ టోర్నీలలో రోజర్ ఫెదరర్ ట్రోఫీలు అందుకొన్నాడు. ఫెదరర్ నెగ్గిన మొత్తం 100 టైటిల్స్ …50 మంది ప్రత్యర్థులతో తలపడి సాధించినవి కావడం మరో విశేషం.

2001- 2005 సంవత్సరాల కాలంలో 33 టైటిల్స్ నెగ్గిన ఫెదరర్..2006-2010 మధ్యకాలంలో సైతం 33 టైటిల్స్ నెగ్గడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది. 2011 -2015 మధ్యకాలంలో 22 టైటిల్స్, 2016-2019 మధ్యకాలంలో 12 టైటిల్స్ సంపాదించాడు.

రెండుదశాబ్దాల తన కెరియర్ లో 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో సహా మొత్తం 100 ఏటీపీ టూర్ టైటిల్స్ నెగ్గడం ద్వారా ఫెదరర్ తనకుతానే సాటిగా నిలిచాడు. ఆధునిక టెన్నిస్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం సంపాదించుకోగలిగాడు.

తన ఆటతీరు, విలక్షణ వ్యక్తిత్వంతో …ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్న రోజర్ ఫెదరర్ లాంటి మరో టెన్నిస్ క్రీడాకారుడు రావాలంటే…ఎంతకాలం వేచిచూడాలో మరి.!

First Published:  9 March 2019 8:47 PM GMT
Next Story