ఒక సారి ఈ బస్సెక్కితే చాలు…. మళ్లీ మళ్లీ ఆ బస్సే ఎక్కాలనుకుంటారు !

బాస్ చెప్పిన పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లడానికి బస్టాండుకు వచ్చాడు రమేష్. అసలే ఇంట్లో భార్యతో చిన్న ఘర్షణ పడ్డాడు. దీంతో మనసంతా చికాకుగా ఉంది. సరే ఇంతలో తను ఎక్కాల్సిన బస్సు రానే వచ్చింది. పరుగున వెళ్లి బస్సెక్కాడు. అలా ఎక్కాడో లేదో.. ఒక వ్యక్తి సాదరంగా ఆహ్వానించాడు. పెదవులపై చెరగని చిరునవ్వుతో.. రండి.. అక్కడ ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోండి.. మీ ప్రయాణం సుఖవంతంగా సాగాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఆప్యాయంగా పలకరించాడు. అప్పటి వరకు చికాకుగా ఉన్న రమేష్‌కి ఈ వింత పలకరింపు ఆశ్చర్యంగా తోచింది. ప్రశాంతంగా వెళ్లి కిటికీ పక్కన కూర్చున్నాడు.

ఇది ఒక్క రమేష్ అనుభవమే కాదు. కోయంబత్తూరులోని ఆ బస్సు ఎక్కిన వారికి ఎదురయ్యే వింత అనుభవమే. తాము బస్సెక్కామా లేక విమానం ఎక్కామా అనేంత ఆశ్చర్యం. ఎందుకంటే ఆ బస్సు కండక్టర్ శివ షణ్ముగం మహత్యం ఇది.

తమిళనాడులోని కోయంబత్తూరు పట్టణంలోని సింగనల్లూరు బస్సు కండక్టర్ శివషణ్ముగం తీరే ప్రత్యేకం. అతడు కేవలం బస్ కండక్టరే అయినా ప్రయాణికులకు మాత్రం ఎయిర్‌ హోస్టెస్‌లా కనిపిస్తాడు. బస్సు ఎక్కే ప్రయాణికులను సాదరంగా ఆహ్యానించడమే కాకుండా… పలు సూచనలు చేస్తుంటాడు.

‘ఇది మన ప్రభుత్వం ఇచ్చిన బస్సు.. దీనిని పరిశుభ్రంగా ఉంచండి. బస్సు ప్రయాణంలో మీకు వికారంగా అనిపిస్తే నాకు చెప్పండి.. నా దగ్గర చింతపండు క్యాండీ ఉంది. వాంతి చేసుకోవాల్సి వస్తే కిటికీ లోంచి బయటకు చేయకండి. నా దగ్గర క్యారీ బ్యాగ్ ఉంది. అడిగి తీసుకోండి’ అంటూ ప్రయాణికులకు చెబుతుంటాడు.

బస్సులో రకరకాల మనస్తత్వాలతో.. కష్టనష్టాలతో ఎక్కే ప్రయాణికులకు షణ్ముగం మాటే ఉపశమనం. 52 ఏళ్ల షణ్ముగం డోర్ దగ్గర నిలబడి ప్రయాణికులను ఆహ్వానించే విధానానికి ఎంతో మంది ఫ్యాన్స్ అయ్యారు. ఆ బస్సే ఎక్కాలంటూ వెయిట్ చేసే ప్రయాణికులు మరెందరో..!

ఇటీవల ఆయన ఒక ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది తనకు తానుగా అనుకొని పాటిస్తున్నానని.. చిన్న పలకరింపు వల్ల ఎంతో మందితో సంబంధాలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. తన బస్సు ఎక్కే ప్రతీ ఒక్కరు ప్రశాంతంగా ప్రయాణించడమే తన లక్ష్యమని షణ్ముగం చెబుతున్నారు. మరి మీరు కూడా ఎపుడైనా కోయంబత్తూర్ వెళ్తే షణ్ముగం బస్సు ఎక్కుతారుగా..!