సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల…. ఏపీలో ఏప్రిల్ 11న ఎన్నికలు

17వ లోక్‌సభ, మూడు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా కాసేపటి క్రితం ప్రకటించారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను మాత్రం వాయిదా వేసింది. ఇక, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనున్నాయి. గతంలో చివరి దశలో జరిగిన ఎన్నికలు ఈ దఫా తొలి విడతలోనే జరుగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సునీల్ అరోరా కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రకటించారు.

గత కొన్ని నెలలుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) సార్వత్రిక ఎన్నికల కోసం కసరత్తు చేస్తూ…. పూర్తి ఏర్పాట్లు చేసిందని సునిల్ అరోరా వెల్లడించారు. ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.

ఎన్నికలకు సమాయాత్తం కావడానికి ముందే అన్ని రాష్ట్రాల సీఈవోలను కలిసి…. అక్కడి పరిస్థితుల గురించి అధ్యయనం చేశామని సీఈసీ వివరించారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికలు జరిపేలా ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు కలిసి పని చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాలు సూచించిన పండుగలు, సెలవలు, పరీక్షల తేదీలను పరిగణనలోనికి తీసుకున్నామని ఆయన చెప్పారు.

22 రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగనుండగా…. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రెండు మూడు విడుతలుగా ఎన్నికలు నిర్వహించడానికి ఈసీఐ ఏర్పాట్లు చేసిందని ఆయన వివరించారు.

ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ ఇలా ఉంది..

మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 25న తొలి విడత నామినేషన్ వెలువడనుండగా.. ఎన్నికల లెక్కింపు మే 23న జరుగనుంది. ఏప్రిల్‌ 11న తొలి దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశ ఏప్రిల్‌ 18, మూడో దశ ఏప్రిల్‌ 23, నాలుగో దశ ఏప్రిల్‌ 29, ఐదో దశ మే6న, ఆరో దశ మే 12, ఏడో దశ మే19న నిర్వహించనున్నట్లు సునీల్ అరోరా తెలిపారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.