Telugu Global
NEWS

వీరిద్దరి మధ్య నిప్పు పెట్టారు... అదే ఇప్పుడు బాబుని కాలు స్తోంది !

ఈ ఇద్దరు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు. ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు లేవు. ఈ ఇద్దరి నియోజకవర్గాలు కూడా ఒకే లోక్ సభ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు కాదు. పోనీ వారసుల కోసం వైరం తెచ్చుకున్నారా… అంటే అదీ లేదు. అయినా రెండు దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య వైరం రావణ కాష్టంలా పెరిగిపోతోంది. ఈ ఇద్దరూ ఎవరనుకుంటున్నారా! ఇంకెవరు విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు. వీరిద్దరిలో చింతకాయల అయ్యన్నపాత్రుడు విశాఖ […]

వీరిద్దరి మధ్య నిప్పు పెట్టారు... అదే ఇప్పుడు బాబుని కాలు స్తోంది !
X

ఈ ఇద్దరు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు. ఇద్దరి మధ్య వ్యాపార లావాదేవీలు లేవు. ఈ ఇద్దరి నియోజకవర్గాలు కూడా ఒకే లోక్ సభ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు కాదు. పోనీ వారసుల కోసం వైరం తెచ్చుకున్నారా… అంటే అదీ లేదు. అయినా రెండు దశాబ్దాలుగా వీరిద్దరి మధ్య వైరం రావణ కాష్టంలా పెరిగిపోతోంది.

ఈ ఇద్దరూ ఎవరనుకుంటున్నారా! ఇంకెవరు విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు. వీరిద్దరిలో చింతకాయల అయ్యన్నపాత్రుడు విశాఖ ఏజెన్సీకి ముఖ ద్వారమైన నర్సీపట్నం నియోజకవర్గం.

గంటా శ్రీనివాసరావు అయితే విశాఖ సిటీ, లేదంటే భీమిలి నియోజకవర్గం. ప్రభుత్వ కార్యక్రమాలు గానీ, అధికారుల బదిలీలు కానీ మరే ఇతర కార్యక్రమం అయినా ఇద్దరికీ పెద్దగా సంబంధాలు ఉండవు. ఇద్దరి మధ్య విభేదించాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు. కానీ గడచిన రెండు దశాబ్దాలుగా ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది.

విశాఖలో ఆధిపత్య పోరు కోసం ఆ ఇద్దరు ఒకరి పతనాన్ని ఒకరు శాసించే స్థితికి చేరుకున్నారు. ఇదంతా తెలుగుదేశం నాయకులకు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసు. అయితే రెండు దశాబ్దాల కాలంలో వారిద్దరినీ కలిసి కూర్చోబెట్టి వివాదాలు సమసిపోయేలా ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నించలేదని జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు చెబుతున్నారు. పైగా వీలున్నప్పుడల్లా పార్టీలో కొందరు నాయకుల చేత వారిద్దరి మధ్య చిచ్చు రగిల్చేలా చేశారంటున్నారు.

ఇద్దరు నాయకుల మధ్య పరస్పర వైరం తనకు అనుకూలంగా మార్చుకుంటూ “ఒకరిపై ఒకరు కోవర్టు ఆపరేషన్లు చేసే విధంగా చంద్రబాబు నాయుడు ప్రవర్తించారు” అని విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. ఇద్దరు నాయకుల మధ్య పెట్టిన చిచ్చు సజావుగానే పెరిగింది.

ఇప్పుడే ఆ చిచ్చు బూమ్ రాంగ్ అయి చంద్రబాబు నాయుడు మీదకు వచ్చిందని అంటున్నారు. అయ్యన్నపాత్రుడ్ని సంతృప్తి పరిచేందుకు భీమిలి స్థానం నుంచి తన తనయుడు నారా లోకేష్ ను రంగంలోకి దింపినట్లుగానే… గంటా శ్రీనివాసరావును సంతృప్తి పరిచేందుకు అయ్యన్నపాత్రుడి కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతను ప్రదర్శించారని అంటున్నారు. దీంతో ఈ ఇద్దరు నాయకులకు చంద్రబాబునాయుడు పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

ఎన్నికల సమీపిస్తున్న కీలక సమయంలో గంటా శ్రీనివాసరావుతో సంప్రదించాలని చంద్రబాబు నాయుడు అనుకున్నా గంటా శ్రీనివాస రావు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం తీవ్ర ఇబ్బంది కలుగ చేసిందని అంటున్నారు. రెండు రోజులుగా ఎన్నిసార్లు ప్రయత్నించినా గంటా శ్రీనివాసరావు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందుబాటులోకి రాలేదు. తన కుమారుడిని భీమిలి నుంచి పోటీ చేయించాలనుకుంటున్న చంద్రబాబునాయుడుకు ఆదిలోనే ఇది ఎదురుదెబ్బ అని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.

ఇక మరో సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు అయితే చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. దీంతో కంగుతిన్న చంద్రబాబు నాయుడు ఆయన వ్యక్తిగత సిబ్బంది చేత అయ్యన్నపాత్రుడికి అనేక సార్లు ఫోన్ చేయించారు.

అయితే అయ్యన్నపాత్రుడు నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాకపోవడం చంద్రబాబును మరింత గందరగోళానికి గురి చేసిందని అంటున్నారు. రేపటి ఎన్నికలలో ఇద్దరి నాయకుల వ్యవహారశైలి…. విశాఖ జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారిద్దరినీ చంద్రబాబు నాయుడు సముదాయించినా వారిద్దరూ మనస్ఫూర్తిగా పార్టీ కోసం పని చేయరని విశాఖ జిల్లా నాయకులు చెబుతున్నారు.

తాను పెట్టిన నిప్పు ఇప్పుడు తనకే తగలడం చంద్రబాబు నాయుడుకు జీర్ణం కావడం లేదని అంటున్నారు. చెడపకు రా… చెడేవు అనే సామెత చంద్రబాబు నాయుడితో సహా సీనియర్ రాజకీయ నాయకులు అందరూ గుర్తెరగాలని చెబుతున్నారు.

First Published:  11 March 2019 12:18 AM GMT
Next Story