లోక్‌సభ బరిలో మన్మోహన్‌ సింగ్?

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహాలం ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా పార్టీలు గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి. జాతీయ పార్టీల్లో సీనియర్లను దింపడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. వారి గత ఇమేజ్ ని ఈ ఎన్నికల్లో వాడుకోవాలని భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది. పంజాబ్‌లో సీట్ల కేటాయింపుపై ఆ పార్టీ రాష్ట్రా శాఖ ఆదివారం సమావేశమైంది. ఈ సందర్భంగా మన్మోహన్‌ను అమృత్‌సర్ నుంచి పోటీకి నిలపాలని నిర్ణయించారు.

కాగా, ఈ విషయం ఇప్పటికే మన్మోహన్‌కు తెలియజేయగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. ఇదే విషయం గురించి కాంగ్రెస్ పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇంచార్జి ఆశాకుమారిని సంప్రదించగా.. ఆయన తిరస్కరించిన మాట వాస్తవమేనని అన్నారు. అయితే ఆ సీటు నుంచి పోటీ చేయడానికి ఆయనను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

దేశ ప్రధానిగా 10 ఏండ్లు పని చేసిన మన్మోహన్ కేవలం ఒక సారి మాత్రమే లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన మొదటి నుంచి రాజ్యసభ సభ్యుడిగానే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అందుకే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన వెనకడుగు వేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.