రిజర్వు బ్యాంక్ నోట్ల రద్దుకు ఒప్పుకోలేదు.. ఆర్టీఐతో వెలుగులోకి వచ్చిన నిర్ణయం

  • నోట్ల రద్దుకు రెండున్నర గంటల ముందు మాత్రమే ఆర్బీఐకి సమాచారం
  • మోడీ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం
  • తమ అభ్యంతరాలను 6 నెలల వరకు బయటకు చెప్పొద్దని ఒప్పందం
  • నోట్ల రద్దు తర్వాత 99 శాతం నగదు తిరిగి చెలామణిలోకి

మోడీ ప్రభుత్వం తీసుకున్న అత్యంత వివాదాస్పద నిర్ణయం.. భారత ప్రజలను పలు ఇబ్బందులకు గురిచేసిన నిర్ణయం డీమానిటైజేషన్ (నోట్లరద్దు). ఎన్నో రంగాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపిన నోట్లరద్దుపై పలు విమర్శలు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా నోట్లరద్దు ప్రభావితం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాంటి సమయంలో ఒక సంచలన నిజం వెలుగులోనికి వచ్చింది.

నోట్ల రద్దుపై ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా పలు విషయాలను వెలుగులోనికి తెచ్చాడు. ప్రధాని మోడీ నోట్ల రద్దును ప్రకటించడానికి కేవలం రెండున్నర గంటల ముందు మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు మీటింగ్ నిర్వహించింది. రాత్రికి రాత్రే నోట్ల రద్దును ప్రకటించడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలగడమే కాకుండా.. నల్ల ధనంపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్బీఐ మోడీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కేవలం ప్రధాని ఒత్తిడి మేరకు నాలుగు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆ సమాధానంలో పేర్కొన్నారు.

ప్రధాని మోడీ 500, 1000 నోట్ల ను రద్దు చేస్తున్నట్లు 8 నవంబర్ 2016లో ప్రకటించే నాటికి ఆర్‌బీఐ ఆ నిర్ణయానికి ఆమోదముద్ర వేయలేదు. డీమానిటైజేషన్ ప్రకటన వచ్చిన ఐదు వారాల తర్వాత అనగా.. 16 డిసెంబర్ 2016న ఆర్బీఐ బోర్డు పెద్ద నోట్ల రద్దును అంగీకరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాంతో పాటే పలు అభ్యంతరాలను కూడా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలుస్తోంది.

నోట్లరద్దుపై సమావేశమైన బోర్డు.. దీని వల్ల జీడీపీ పై వ్యతిరేక ప్రభావం పడుతుందని తేల్చింది. బోర్డు మీటింగ్‌లో ఆనాటి గవర్నర్ ఉర్జిత్ పటేల్‌తో పాటు.. ప్రస్తుత గవర్నర్, ఆనాటి ఆర్థిక వ్యవహారాల ముఖ్య కార్యదర్శి శక్తికాంత్ దాస్ కూడా ఉన్నారు. ఆనాడు చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో నకిలీ నోట్లు 400 కోట్ల వరకు ఉండొచ్చని.. కాని ఇది ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపబోదని బోర్డు అభిప్రాయపడింది.

నల్లధనం నగదు రూపంలో ఉండదని.. బంగారం, ఆస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉంటుందని.. నోట్ల రద్దు వల్ల నల్లధనం తగ్గే ప్రసక్తే ఉండదని బోర్డు ఆనాడు తేల్చి చెప్పింది. ఈ బోర్డు నిర్ణయాలను, అభ్యంతరాలను ఆరు నెలల వరకు బయటకు చెప్పబోమని ప్రభుత్వానికి మాట కూడా ఇచ్చిందని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.

ఇక నోట్ల రద్దు తర్వాత అప్పటి వరకు చలామణిలో ఉన్న 99 శాతం నోట్లు తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేశాయి. దీనిపై ప్రభుత్వాన్ని విపక్షాలతో సహా పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.