Telugu Global
NEWS

హైదరాబాద్ సుల్తాన్స్.... ఓవైసీలకు పెట్టని కోట !

హైదరాబాద్ ఎంతో చరిత్ర కలిగిన నగరం. ఆనాటి ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలు కలిగి ఉంటూనే.. ఆధునిక ప్రపంచానికి రోల్ మోడల్‌గా నిలిచే నగరం. ఎన్నో శతాబ్దాలుగా ముస్లిం నవాబులు, సుల్తాన్స్‌ ఏలిన హైదరాబాద్‌లో ఇప్పటికీ ముస్లింల ఆధిపత్యమే కనిపిస్తుంది. దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇందిర, ఎన్టీఆర్, సోనియా, వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్, మోడీ వంటి నాయకుల ప్రభంజనం ఉన్నా…. హైదరాబాద్ మాత్రం ఓవైసీ కుటుంబానికి కంచు కోటలా మారింది. భారత్ దేశం గణతంత్ర రాజ్యంగా […]

హైదరాబాద్ సుల్తాన్స్.... ఓవైసీలకు పెట్టని కోట !
X

హైదరాబాద్ ఎంతో చరిత్ర కలిగిన నగరం. ఆనాటి ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలు కలిగి ఉంటూనే.. ఆధునిక ప్రపంచానికి రోల్ మోడల్‌గా నిలిచే నగరం. ఎన్నో శతాబ్దాలుగా ముస్లిం నవాబులు, సుల్తాన్స్‌ ఏలిన హైదరాబాద్‌లో ఇప్పటికీ ముస్లింల ఆధిపత్యమే కనిపిస్తుంది. దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇందిర, ఎన్టీఆర్, సోనియా, వైఎస్సార్, చంద్రబాబు, కేసీఆర్, మోడీ వంటి నాయకుల ప్రభంజనం ఉన్నా…. హైదరాబాద్ మాత్రం ఓవైసీ కుటుంబానికి కంచు కోటలా మారింది.

భారత్ దేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం నడిచినా 1984 తర్వాత మాత్రం ఇది ఓవైసీ కుటుంబం చేతుల్లోకి వెళ్లిపోయింది. తొలిసారిగా 1984లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ.. ఆ తర్వాత ఏఐఎంఐఎం పార్టీని స్థాపించి దాని తరపున వరుసగా 5 సార్లు ఘనవిజయం సాధించారు. ఆయన తదనంతరం పెద్ద కొడుకు అసదుద్దీన్ ఓవైసీ 2004 నుంచి ఇప్పటి వరకు ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు.

హైదరాబాద్ నియోజకవర్గంలో ముస్లింల పెద్దన్నగా ఉండే సలావుద్దీన్ తన పరిధిలోని ఏడు నియోజకవర్గాలను చాలా ప్రభావితం చేసేవారు. కార్వాన్, గోషామహల్ మినహా మిగతా నియోజకవర్గాల్లో ఎక్కువగా ఎంఐఎం అభ్యర్థులే అసెంబ్లీకి వెళ్లేవారు. ఈ నియోజకవర్గంలో 18,23,217 మంది ఓటర్లు ఉండగా…. అందులో 76 శాతం ముస్లిం ఓటర్లే ఉండటం గమనార్హం.

ఇక రాష్ట్రంలో (ఉమ్మడి ఏపీతో సహా) ఏ ప్రభుత్వం ఉన్నా వారు ఎంఐఎంను మిత్రపక్షంగానే భావించే వారు. కాంగ్రెస్ పార్టీతో అత్యధిక కాలం మితృత్వం నెరపిన ఎంఐఎం పార్టీ ఆ తర్వాత టీఆర్ఎస్‌తో సన్నిహితంగా ఉంటోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా బహిరంగంగానే ఎంఐఎంతో స్నేహం గురించి చెబుతుంటారు. రాష్ట్రంలో ఎలా ఉన్నా.. హైదరాబాద్‌లో మాత్రం ఎంఐఎం ఆకాంక్షలకు అనుగుణంగానే పరిపాలన నడుస్తుందనేది బహిరంగ రహస్యం.

ఇక ఈ సారి కూడా హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఓవైసీ నిలబడటం ఖాయమే. టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుండటంతో భారీ మెజార్టీతో ఓవైసీని గెలిపించాలని ఎంఐఎం శ్రేణులు భావిస్తున్నాయి. 2004లో తొలి సారిగా ఎంపీ బరిలో నిలిచి లక్ష పైచిలుకు ఓట్లతో ఓవైసీ గెలుపొందారు. 2009లో తన మెజార్టీని 1 లక్ష 13వేలకు పెంచుకున్నారు. ఇక 2014లో మోడీ ప్రభంజనంలోనూ మూడు లక్షలకు పైగా మెజార్టీతో అసదుద్దీన్ పార్లమెంటుకు ఎంపికయ్యారు.

ఈ సారి హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు గాను గోషా మహల్ తప్ప అన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీనే తిరిగి వస్తే నాలుగు లక్షలకు పైగా మెజార్టీ సాధించడం ఖాయమేనని పార్టీ భావిస్తోంది.

అయితే అసదుద్దీన్‌ పై కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను నిలబెట్టినా అంతగా ప్రభావం ఉండకపోవచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

First Published:  12 March 2019 4:10 AM GMT
Next Story