ఇప్పుడు కాదు…. 15న రండి : షా హుకుం

భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులకు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా రెండు సంవత్సరాలుగా తెలంగాణకు చెందిన నాయకులెవ్వరినీ అధిష్టానం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఇటీవల జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అయితే అధిష్టానం నిర్లక్ష్యం మరింతగా కనపడింది. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర సమతితో అధిష్టానానికి లోపాయికారిగా ఉన్న స్నేహమే అని తెలంగాణ కమలనాథులు అంటున్నారు.

గడచిన రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్ని ఉద్యమాలు చేసినా…. విలేకరుల సమావేశాల్లోను, బహిరంగ సభల్లోనూ ఎన్ని విమర్శలు చేసినా వాటికి కనీస విలువ కూడా ఇవ్వడం లేదని వారంతా వాపోతున్నారు.

అంతే కాదు… ఇంతకు ముందు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు అయితే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ ను ముఖ్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును వేనోళ్ల పొగిడి వెళ్లారు. దీని ప్రభావం తెలంగాణ ముందస్తు ఎన్నికలపై పడిందంటున్నారు. ఇప్పుడు తాజాగా పార్టీ అధినేత అమిత్ షా కూడా అదేవిధంగా ప్రవర్తించడం తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఆగ్రహం తీసుకువచ్చిందంటున్నారు.

లోక్ సభకు ఎన్నికల కమిషన్ శంఖారావం ఊదడంతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు అభ్యర్ధుల విషయమై పార్టీ పెద్దలతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లారు. ఇలా ఢిల్లీ వెళ్లిన వారిలో పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, సీనియర్ నాయకులు బంగారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, ఎం.వీ.వీ.ఎస్. ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి వంటి వారున్నారు.

వీరంతా రానున్న లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులపై చర్చించాలని ఢిల్లీ వెళ్లిన వారే. వీరిలో కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ స్ధానం నుంచి ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నారు. బండారు దత్తాత్రేయ సిట్టింగ్ ఎంపీ కూడా. మాజీ ఎమ్మెల్యేలు ఎం.వీ.వీ.ఎస్.ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి అయితే మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు.

ఇక పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అయితే భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ అంశాలపై అధిష్టానంతో చర్చించాలని వీరంతా హస్తినకు పయనమయ్యారు.

అయితే వీరికి అక్కడ నిరాశే ఎదురైందంటున్నారు. పార్టీ అధినేత అమిత్ షా తెలంగాణ నాయకులను కలిసిన వెంటనే… ” ఎందుకు వచ్చారు…. తెలంగాణలో పార్టీ ఎలా ఉంది” అని ప్రశ్నించి ఆ తర్వాత ” టీఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించలేదుగా… వారు ప్రకటించాక మనం చూద్దాం. మీరు ఇప్నుడు వెళ్లి…… నాలుగు రోజుల తర్వాత అంటే 15 వ తేదీ తర్వాత రండి ” అని సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు.