Telugu Global
International

స్విస్ ఖాతాలో అక్రమ సొమ్ము... 'చందమామ' పత్రికపై ఆరోపణలు

‘చందమామ’ కథల పుస్తకం ఈనాటి పిల్లలకు అంతగా తెలియకపోవచ్చు గాని ఒకప్పుడు చాలా ఆదరణ పొందింది. ఎన్నో దశాబ్దాలుగా చిన్న పిల్లలకు కథల ద్వారా విలువలు, ప్రమాణాలు, నీతులు నేర్పిన కథల పుస్తకం అది. చందమామ పుస్తకం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తూ ఉండే పిల్లలు…. వచ్చిన తర్వాత చదవడానికి పోటీలు పడేవారు. అలా నీతులు బోధించిన చందమామ పత్రిక ఇప్పుడు ‘అక్రమ సంపాదన’ అనే మచ్చ తగిలించుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 1947లో […]

స్విస్ ఖాతాలో అక్రమ సొమ్ము... చందమామ పత్రికపై ఆరోపణలు
X

‘చందమామ’ కథల పుస్తకం ఈనాటి పిల్లలకు అంతగా తెలియకపోవచ్చు గాని ఒకప్పుడు చాలా ఆదరణ పొందింది. ఎన్నో దశాబ్దాలుగా చిన్న పిల్లలకు కథల ద్వారా విలువలు, ప్రమాణాలు, నీతులు నేర్పిన కథల పుస్తకం అది. చందమామ పుస్తకం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తూ ఉండే పిల్లలు…. వచ్చిన తర్వాత చదవడానికి పోటీలు పడేవారు. అలా నీతులు బోధించిన చందమామ పత్రిక ఇప్పుడు ‘అక్రమ సంపాదన’ అనే మచ్చ తగిలించుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

1947లో నాగిరెడ్డి – చక్రపాణి అనే తెలుగు సినీ నిర్మాతలు చందమామ పిల్లల కథల పుస్తక ప్రచురణను ప్రారంభించారు. ఎన్నో దశాబ్దాల పాటు పాపులర్ చిల్డ్రన్ మ్యాగజైన్‌గా పేరొందిన దీన్ని 2007లో ముంబైకి జియోదేశిక్ అనే కంపెనీకి అమ్మారు. ఇప్పుడు ఈ పత్రిక డైరెక్టర్లు అయిన ప్రశాంత్ శరద్ ములేకర్, పంకజ్ కుమార్ ఓంకార్ శ్రీవాస్తవ, కిరణ్ కులకర్ణిలపై మనీ లాండరింగ్, ఆర్థిక అవకతవకలు, అక్రమ సొమ్ము తదితర కేసులు నమోదయ్యాయి.

ఈ ముగ్గుర డైరెక్టర్లు స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో అక్రమంగా సొమ్ము దాచిపెట్టినట్లు భారత అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పంచుకోవడానికి స్విస్ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. మార్చి 5న జియోదేశిక్‌తో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ల ఖాతాలకు సంబంధించిన పాలనాపరమైన సహాయం అందించడానికి స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ సుముఖత వ్యక్తం చేసింది.

గతంలో అంటే.. 30 అక్టోబర్ 2018లో కూడా వీరి ఖాతాల వివరాలను ఇవ్వాలని భారత్ కోరితే దానిపై వాళ్లు అప్పీలు చేశారు. దాంతో అప్పుడు స్విస్ బ్యాంకులు వివరాలు ఇవ్వలేకపోయాయి. కాని ఇప్పుడు వివరాలు మాత్రం అందిస్తామని స్విస్ తేల్చి చెప్పింది.

ఇక చందమామ సంస్థ జియోదేశిక్‌పై స్టాక్ మార్కెట్‌లో పలు ఉల్లంఘనలు నమోదయ్యాయి. దీనిపై సెబీ దర్యాప్తు జరుపుతోంది. పలు కారణాల వల్ల 2014 నుంచి ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ కావడం లేదు. ఎంతో ప్రజాదరణ పొందిన చందమామ వంటి పత్రిక చివరకు ఇలా అవినీతి మయంగా మారడం పలువురు జీర్ణించుకోలేక పోతున్నారు.

First Published:  11 March 2019 8:40 PM GMT
Next Story