టీమిండియా పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గరంగరం

  • ఆర్మీ క్యాప్ లు ధరించడం పై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు
  • ఐసీసీ అనుమతితోనే ఆర్మీక్యాప్ లు ధరించిన విరాట్ సేన

ఆస్ట్రేలియా తో పాంచ్ పటాకా సిరీస్ లో భాగంగా రాంచీలో ముగిసిన మూడో వన్డేలో…విరాట్ కొహ్లీ అండ్ కో…సైనికులు ధరించే క్యాప్ లతో పాల్గొనడాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తప్పు పట్టింది.

ఇది జెంటిల్మెన్ గేమ్…. క్రికెట్ నిబంధనలకు వ్యతిరేకమని, క్రికెట్ ను రాజకీయాలతో మిళితం చేసిన టీమిండియాను కఠినంగా శిక్షించాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసింది.

పుల్వామా అమరులకు శ్రద్ధాంజలిగా….

పుల్వామా అమరవీరులకు శ్రద్ధాంజలిగా..విరాట్ కొహ్లీ అండ్ కో…ఆర్మీ క్యాప్ లు ధరించి మూడో వన్డేలో పాల్గొన్నారు. అంతేకాదు…ఇక నుంచి ప్రతిఏడాది స్వదేశీ సిరీస్ లోని ఓ మ్యాచ్ లో ఆర్మీ క్యాప్ లు ధరించి పాల్గొని తీరాలని కూడా బీసీసీఐ నిర్ణయించింది.

ఐసీసీ అనుమతితోనే….

రాంచీ వన్డేలో టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ  అధికారిక టోపీల స్థానంలో …ఆర్మీ క్యాప్ లను ధరించడానికి ఐసీసీ నుంచి ముందుగానే అనుమతి తీసుకొన్నారు. భారత సైనికదళాల సహాయార్థం నిర్వహించే మ్యాచ్ లకు మాత్రమే ప్రత్యేక క్యాప్ లు ధరిస్తామని ఐసీసీకి బీసీసీఐ వివరణ ఇచ్చింది.

అంతేకాదు…రాంచీ వన్డే మ్యాచ్ లో పాల్గొన్న భారతజట్టు సభ్యులు తమ మ్యాచ్ ఫీజును భారత సైనికదళాల సంక్షేమ నిధికి ఇవ్వనున్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ప్రకటించాడు.

పీసీబీ వితండవాదం….

ఐసీసీ నియమావళిని గతంలో అతిక్రమించి… వేరే క్యాప్ లు ధరించిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మోయిన్ అలీ, సౌతాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నారని, ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు సైతం అదే తప్పు చేశారని పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఇసాన్ మణి గుర్తు చేశారు.

రాజకీయాలతో క్రీడలకు…ప్రధానంగా క్రికెట్ కు ఏమాత్రం సంబంధం లేదని…అయితే బీసీసీఐ మాత్రం క్రికెట్ ను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని పీసీబీ చైర్మన్ ఫిర్యాదు చేశారు.

బీసీసీఐ పై ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకొనే వరకూ తాము పోరాడుతూనే ఉంటామంటూ పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

అయితే…. అంతర్జాతీయ క్రికెట్ మండలికే వెన్నెముకలాంటి బీసీసీఐ పై క్రమశిక్షణ చర్యలు తీసుకొనే సాహసం ఐసీసీ చేస్తుందా? అన్నదే ఇక్కడి అసలు పాయింటు.