Telugu Global
National

వారణాసితో పాటు పూరీ బరిలో మోడీ..?

ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలి సారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నోట్లరద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలను నిర్భయంగా తీసుకున్న ఆయన చివర్లో కాస్త దూకుడు తగ్గించారు. ఎన్నికల ముందు తనకు నచ్చని కిసాన్ స‌మ్మాన్ నిధి వంటి వాటికి ఆమోద ముద్ర వేశారంటే కారణం.. ఈ సారి ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని కూడా ప్రతిపక్షాలకు ఇవ్వకూడదనే..! కాగా, గత ఎన్నికల్లో వారణాసి, వడోదర నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా […]

వారణాసితో పాటు పూరీ బరిలో మోడీ..?
X

ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తొలి సారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నోట్లరద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలను నిర్భయంగా తీసుకున్న ఆయన చివర్లో కాస్త దూకుడు తగ్గించారు. ఎన్నికల ముందు తనకు నచ్చని కిసాన్ స‌మ్మాన్ నిధి వంటి వాటికి ఆమోద ముద్ర వేశారంటే కారణం.. ఈ సారి ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని కూడా ప్రతిపక్షాలకు ఇవ్వకూడదనే..!

కాగా, గత ఎన్నికల్లో వారణాసి, వడోదర నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా గెల్చిన మోడీ.. పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసినే అట్టిపెట్టుకొని వడోదరను వదిలేశారు. ఇక ఈ దఫా కూడా వారణాసి నుంచి మోడీ పోటీ చేయడం ఖాయమే. కాని బీజేపీ పెద్దలు మరో ఆలోచన కూడా చేస్తున్నారు.

ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఇంకా ప్రభావితం చూపుతున్న కీలకమైన మధ్య భారతంలో కాంగ్రెస్ పుంజుకోవడం బీజేపీకి ఇబ్బందిగా మారింది.

ఈ నేపథ్యంలో ఒడిషా లేదా మధ్యప్రదేశ్‌లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి మోడీ పోటీ చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్ కంటే ఒడిషాలో పోటీ చేస్తే బాగుంటుందని కూడా చర్చ జరుగుతోంది. పూరీ కూడా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ టెంపుల్ సిటీ నుంచి కూడా మోడీ పోటీ చేయడం వల్ల ఒడిషా బీజేపీ క్యాడర్‌లో ఉత్సాహం పెంచినట్లు ఉంటుందని.. అంతే కాక అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో.. నాలుగు పర్యాయాలుగా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్‌‌ మీద ఉండే వ్యతిరేకత బీజేపీకి కలసి వస్తుందని అధిష్టానం భావిస్తోంది.

రెండు పుణ్యక్షేత్రాల నుంచి పోటీ చేయడం పార్టీకి శుభసూచకంగా ఉంటుందనీ.. అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో మోడీ ప్రభావం తప్పక పని చేస్తుందని పార్టీ అనుకుంటోంది. మరి మోడీ పూరీ స్థానంలో పోటీ చేస్తారా లేదా అనే విషయం ఒకటి రెండ్రోజుల్లో తేలిపోనుంది.

First Published:  12 March 2019 5:38 AM GMT
Next Story